Mahaa Daily Exclusive

  కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కన్నెర్ర…

Share

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కన్నెర్ర.
* అన్ని ప్యాకేజీల సమగ్ర నివేదికకు ఆదేశం.
* గాలిలో మేడలు కట్టొద్దు.
* క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఎలా చెబుతారు?..
* మల్లన్నసాగర్ అదనపు టీఎంసీ పనులు వేగవంతం చేయండి.
* వారం రోజుల్లో పూర్తి చిట్టా విప్పాలి.
* ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి డెడ్ లైన్.
హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, పెండింగ్ పనుల పూర్తిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన లోపాలను సవరించడంతో పాటు, నిలిచిపోయిన పనులను ఒక కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అక్కడో పని, ఇక్కడో పని అన్నట్లు కాకుండా ప్రాజెక్టులోని అన్ని ప్యాకేజీలకు సంబంధించిన సమగ్ర వివరాలను వారం రోజుల్లోగా తమ ముందు ఉంచాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పనుల్లో జాప్యం, నిధుల దుబారాను సహించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు.
**ప్యాకేజీల చిట్టా విప్పండి**
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని ప్యాకేజీల తాజా పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అదనపు టీఎంసీ పనులతో కలుపుకుని భూసేకరణ, ఇప్పటి వరకు జరిగిన పనులు, ఇంకా మిగిలి ఉన్న పనులు, పెండింగ్ బిల్లుల వివరాలు, ప్రాజెక్టు పూర్తి కావడానికి అవసరమయ్యే వాస్తవ బడ్జెట్ తదితర పూర్తి సమాచారాన్ని నివేదికలో పొందుపరచాలని ఆదేశించారు. మల్లన్నసాగర్ దిగువన ఉన్న ఆయకట్టుకు నీటి సరఫరా, కాలువల నిర్మాణం, కొత్త రిజర్వాయర్ల పనులకు ఎదురవుతున్న ఆటంకాలను సైతం నివేదికలో స్పష్టంగా ప్రస్తావించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వారం రోజుల్లో ఈ బృహత్ నివేదికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
**ఎల్లంపల్లి-మల్లన్నసాగర్ పనులపై నజర్**
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మల్లన్నసాగర్ వరకు చేపట్టిన అదనపు టీఎంసీ పనుల పురోగతిపై సమీక్షలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ పనులు పూర్తయితేనే మల్లన్నసాగర్ నుంచి ఆశించిన మేర నీటిని సరఫరా చేయడం సాధ్యమవుతుందని అధికారులు వివరించారు. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు, మూసీ పునరుజ్జీవనానికి 20 టీఎంసీలను వినియోగించుకునేలా పనులు వేగవంతం చేశారు. రాబోయే రెండేళ్లలో వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలో 60 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయని, సర్జ్ పూల్స్, పంప్ హౌస్ లు, డెలివరీ సిస్టర్న్ లాంటి పనులు 80 నుంచి 90 శాతం పూర్తయినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. మిగిలిన పనుల పూర్తికి మరో రూ.13 వేల కోట్లు ఖర్చవుతుందని వారు అంచనా వేశారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి కాకపోతే భవిష్యత్తులో నీటి సరఫరాలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
**నిజామాబాద్ ప్యాకేజీలు.. వాస్తవికత ఏది?**
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఉమ్మడి నిజామాబాద్ కు నీటిని మళ్లించే కాళేశ్వరం 21, 22 ప్యాకేజీల పనుల పైనా ముఖ్యమంత్రి ఆరా తీశారు. మాసాని, మంచిప్ప చెరువుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, వాటి రద్దు, తిరిగి ఐదు టీఎంసీల సామర్థ్యంతో నీటిని సరఫరా చేయడం లాంటి ప్రతిపాదనలపై ఆయన అధికారులను ప్రశ్నించారు. కేవలం 0.2 టీఎంసీల సామర్థ్యం ఉన్న చెరువులో ఏకంగా 5 టీఎంసీల నీటిని ఎలా నిల్వ చేస్తారని నిలదీశారు. ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా పనులు ప్రారంభించి తర్వాత సమస్యల బారిన పడేకంటే, ముందే అన్ని కోణాల్లో సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే ముందుకు వెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు.
**గాలిలో మేడలు కట్టొద్దు.. అధికారులపై సీఎం ఫైర్**
ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు ప్రాణహిత నది నీటిని మళ్లించే పథకంపై అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ పై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు 150 మీటర్లు, 149 మీటర్ల పూర్తి స్థాయి నీటిమట్టం తదితర అంశాలను వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. కనీసం నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారా అని సూటిగా ప్రశ్నించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, భౌగోళిక వాస్తవాలు తెలియకుండా గాలిలో మేడలు కట్టొద్దని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులనే మళ్లీ పునరావృతం చేస్తే ఊరుకునేది లేదని అధికారులపై మండిపడ్డారు. పర్యావరణ అనుమతులు లాంటి అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేయకుండా పనులు మొదలుపెడితే తీవ్ర జాప్యం జరుగుతుందని, దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ముందే అన్ని అనుమతులు పక్కాగా తెచ్చుకున్నాకే ముందడుగు వేయాలని స్పష్టం చేశారు.