తమిళనాడులో పొలిటికల్ ట్విస్ట్.
* దళపతి విజయ్‌కు గవర్నర్ షాక్!
* మ్యాజిక్ ఫిగర్ లేకుండా ఎలా వస్తారు?.
* ప్రభుత్వ ఏర్పాటుకు నో చెప్పిన గవర్నర్ రాజేంద్ర అర్లేకర్.
* కేవలం 112 మంది ఎమ్మెల్యేల మద్దతే.
* మరో ఆరుగురు సభ్యుల కోసం టీవీకే అన్వేషణ.
* వాయిదా పడనున్న ప్రమాణ స్వీకారం.
* పూర్తి సంఖ్యాబలంతో రావాలని స్పష్టం చేసిన రాజ్ భవన్.
హైదరాబాద్, మహా
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (తమిళగ వెట్రి కజగం) అధినేత, సినీనటుడు విజయ్‌కు రాజ్ భవన్ వేదికగా చుక్కెదురైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ బుధవారం సాయంత్రం విజయ్.. రాష్ట్ర గవర్నర్‌ను కలవగా ఆయన ఆ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది సభ్యుల (మ్యాజిక్ ఫిగర్) మద్దతును నిరూపించడంలో విజయ్ విఫలం కావడంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనుమతి నిరాకరించారు. దీంతో గురువారం జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడినట్లేనని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.
రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు గాను టీవీకే ఏకంగా 108 స్థానాల్లో గెలుపొంది ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు గట్టి షాక్ ఇస్తూ విజయ్ పార్టీ విజయఢంకా మోగించింది. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడంలో మాత్రం టీవీకే వెనుకబడింది. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు దళపతి విజయ్ తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయ్‌కు మద్దతు ప్రకటించింది. తమ ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు లేఖను టీవీకేకు అధికారికంగా అందజేసింది. అయితే విజయ్ రెండు చోట్ల గెలవడంతో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో టీవీకే వాస్తవ బలం 107గా, కాంగ్రెస్ మద్దతుతో కలుపుకుని మొత్తం ఆ కూటమి బలం 112కు చేరింది.
ఈ 112 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలంతోనే బుధవారం సాయంత్రం విజయ్.. పార్టీ ముఖ్య నేతలతో కలిసి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను రాజ్ భవన్‌లో కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని అధికారికంగా లేఖను సమర్పించారు. అయితే, గవర్నర్ విజయ్ అభ్యర్థనను తోసిపుచ్చారు. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవడానికి 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం తప్పనిసరి అని, కేవలం 112 మంది మద్దతు లేఖలు మాత్రమే సమర్పించినందున ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించలేనని గవర్నర్ తేల్చిచెప్పారు. మిగతా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు విషయంలో విజయ్ ఇచ్చిన వివరణతో గవర్నర్ ఏమాత్రం సంతృప్తి చెందలేదు. పూర్తి మెజార్టీకి సరిపడా సభ్యుల మద్దతు కూడగట్టిన తర్వాతే, కచ్చితమైన సంఖ్యాబలంతో మళ్లీ రావాలని గవర్నర్ సూచించినట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.
గవర్నర్ తాజా నిర్ణయంతో విజయ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గురువారం (మే 7) నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయొచ్చని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేశాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మరింత ఆలస్యం కానుంది. మరోవైపు మిగిలిన ఆరుగురు సభ్యుల మద్దతు కూడగట్టేందుకు విజయ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీసీకే వామపక్షాలు లేదా ఏఐఏడీఎంకే మద్దతు కోసం టీవీకే నేతలు తెరవెనుక తీవ్ర మంతనాలు సాగిస్తున్నారు. ఆయా పార్టీలు అధికారికంగా మద్దతు ప్రకటిస్తే దళపతి విజయ్ సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే అవుతుంది. లేనిపక్షంలో తమిళనాట రాజకీయ ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజులు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి.








