Mahaa Daily Exclusive

  కొడంగల్‌ను ‘బంగారు తునక’లా తీర్చిదిద్దుతా…..

Share

కొడంగల్‌ను ‘బంగారు తునక’లా తీర్చిదిద్దుతా.
* 2034 దాకా రాజకీయాలు వద్దు.
* మన గడ్డ అభివృద్ధిపైనే గురి!
* మెట్ట భూములకు కృష్ణమ్మ జలాలు.
* లగచర్లలో 220 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్!
* ఆధ్యాత్మికం.. విద్యా.. వైద్యం.
* కొడంగల్‌కు ముఖ్యమంత్రి వరాల జల్లు!
* రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయానికి భూమిపూజ.
* 430 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన!

హైదరాబాద్, మహా.

తనకు రాజకీయ భిక్ష పెట్టిన కొడంగల్ గడ్డను దేశానికే ఆదర్శంగా, ఒక ‘బంగారు తునక’లా తీర్చిదిద్దడమే తన అంతిమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గతంలో ఈ ప్రాంతానికి ఒక్క మంత్రి పదవి కూడా రాలేదని, కనీస సమస్యల పరిష్కారం కోసం ఇతరులను యాచించాల్సిన పరిస్థితి ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ముఖ్యమంత్రి పదవి దక్కడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని భావోద్వేగంతో పలికారు.

**పేదల తిరుపతిగా శ్రీ వేంకటేశ్వర ఆలయం.. ఆధ్యాత్మిక హబ్‌గా కొడంగల్**
కొడంగల్‌ను ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు రూ. 110 కోట్ల భారీ వ్యయంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. తిరుమలలో ఏ రకమైన ఆగమ శాస్త్ర పూజలు జరుగుతాయో, ఇక్కడ కూడా అదే స్థాయిలో వైభవం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేశంలోనే గొప్ప ఆగమ శాస్త్ర కోవిదుడైన సుందరవరదాచార్యుల సేవలను సీఎం కొనియాడారు. వారి గౌరవార్థం ఆలయ ప్రాంగణంలోని ఒక విభాగానికి సుందరవరదాచార్యుల పేరు పెడతామని ప్రకటించారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు తరలివచ్చేలా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దీనితో పాటు దౌల్తాబాద్ వేంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గి వేణుగోపాల స్వామి ఆలయాల అభివృద్ధికి కూడా శంకుస్థాపనలు చేస్తూ ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్దపీట వేశారు.
**లగచర్లలో విద్య, వైద్య విప్లవం.. 220 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్**
కొడంగల్ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా రంగంలో సీఎం రేవంత్ రెడ్డి భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. లగచర్ల వద్ద 220 ఎకరాల విస్తీర్ణంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ‘ఎడ్యుకేషన్ హబ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నాడు ఈ ప్రాంత బిడ్డలు చదువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారని, కానీ నేడు రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు కొడంగల్‌కు వచ్చేలా విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామన్నారు. దీనికి తోడు ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ లగచర్లలో 430 పడకల అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం స్థానికంగానే అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
**సాగునీటి కల సాకారం.. కృష్ణమ్మ జలాలతో పచ్చని పొలాలు**
కొడంగల్ మెట్ట భూములను సస్యశ్యామలం చేయడమే తన ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తయిందని, నిధుల కొరత లేదని భరోసా ఇచ్చారు. కృష్ణా నదీ జలాలతో ఈ ప్రాంత భూములు తడిసే వరకు విశ్రమించేది లేదని, ఈ ప్రాజెక్టును ఏడాదిన్నరలోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పనులను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరిలను సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ పనులను వేగవంతం చేస్తామని, రేకులపాడు ప్రాంతంలో రానున్న ఆరు నెలల్లో సిమెంట్ పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని విప్లవాత్మక ప్రకటనలు చేశారు.
**రాజకీయాలు పక్కన పెడదాం.. 2034 దాకా కేవలం అభివృద్ధి!**
కొడంగల్ అభివృద్ధి కోసం రాజకీయ విభేదాలను విడనాడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 2034 వరకు గుంపులు, గ్రూపులు పక్కన పెట్టి, కేవలం అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగాలని నాయకులకు సూచించారు. కోస్గి నుంచి శంషాబాద్ వరకు 300 అడుగుల రోడ్డును నిర్మిస్తున్నామని, దీని ద్వారా ఈ ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారుతుందని తెలిపారు. పేదల సమస్యలను పరిష్కరించేందుకు మండలానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఏ గ్రామంలో ఏ పని కావాలో తన దృష్టికి తీసుకురావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.