2027 జూన్ నాటికి పోలవరం పూర్తి.
* మంత్రి నిమ్మల రామానాయుడు.
*వచ్చే ఏడాది అద్భుత ఘట్టం.
* జాతికి అంకితం చేయనున్న మోదీ, చంద్రబాబు.
* వైసీపీ హయాంలో ప్రాజెక్టు విచ్ఛిన్నం.
* తుంగభద్ర గేట్లపై నిర్లక్ష్యం వల్లే ప్రమాదకర స్థితి.
*నదుల అనుసంధానమే రాష్ట్ర నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం.
అమరావతి:మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరప్రదాయిని, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణంలో నవశకం ప్రారంభం కాబోతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అన్ని అడ్డంకులను అధిగమించి, శరవేగంగా పనులు పూర్తి చేసి 2027 జూన్ నాటికి ఈ మహా ప్రాజెక్టును సిద్ధం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తికాగానే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌లు కలిసి ఈ చారిత్రక కట్టడాన్ని జాతికి అంకితం చేస్తారని వెల్లడించారు. మంగళవారం జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అణుమాత్రం కూడా వెనకడుగు వేయబోదని ఉద్ఘాటించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు గతి తప్పిందని, పాలకుల అవగాహనా రాహిత్యం, రివర్స్ టెండరింగ్ వంటి నిర్ణయాల వల్ల ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని మంత్రి నిమ్మల మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం నుంచి నిధుల మళ్లింపు వరకు ప్రతి విషయంలోనూ గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. కేవలం పోలవరమే కాకుండా, రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులను కూడా వైసీపీ సర్కారు గాలికొదిలేసిందని విమర్శించారు. ముఖ్యంగా తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు నేడు అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకోవడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. గేట్ల నిర్వహణను, మరమ్మతులను ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే రైతులకు అందాల్సిన నీరు వృథాగా పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రతి చుక్క నీటిని ఒడిసి పట్టి రైతులకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే భూగర్భ జల మట్టాలను భారీగా పెంచే దిశగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం, చెరువుల పునరుద్ధరణ వంటి పనుల ద్వారా జలవనరులను కాపాడుకుంటామని వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న సాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఈ నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు శాశ్వతంగా విముక్తి లభిస్తుందని, రాయలసీమతో పాటు ఇతర మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీటి రంగాన్ని మళ్లీ పట్టాలెక్కించి, రైతాంగాన్ని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.








