పాలక పక్షం ఒకే..!
• మరి ప్రతిపక్షం ఎక్కడ.
*ఎన్నికల ముందు కత్తులు.
* ఎన్నికల తర్వాత కౌగిలింతలు.
* తమిళనాట ‘అడ్జస్ట్మెంట్’ రాజకీయాల వెనుక ప్రజల వంచన.
**తమిళనాడు అసెంబ్లీలో ఇప్పుడు ఆవిష్కృతమవుతున్న దృశ్యం ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత విచిత్రమైనది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న టీవీకే (TVK), ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న డీఎంకే (DMK), అలాగే మూడో స్థానంలో ఉన్న అన్నా డీఎంకే (AIADMK).. ఈ పార్టీల జెండాలు, రంగులు వేరైనా వాటి రక్తంలో ప్రవహిస్తున్న సైద్ధాంతిక డీఎన్ఏ (DNA) మాత్రం నూటికి నూరు శాతం ఒక్కటే!.పెరియార్ ఆశయాలు, సామాజిక న్యాయం, లౌకికవాదం, హిందీ వ్యతిరేకత అనే ఒకే సైద్ధాంతిక పునాదిగా పుట్టిన పార్టీలే నేడు అధికార, ప్రతిపక్ష స్థానాలను పంచుకున్నాయి.దానికి తోడు, ఎన్నికల ముందు వరకూ డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు, ముస్లిం లీగ్ సైతం ఇప్పుడు అవకాశవాదంతో అధికార టీవీకే ప్రభుత్వంలోకి చేరిపోయాయి.మరి పాలకుల సిద్ధాంతం, ప్రతిపక్షం సిద్ధాంతం, మద్దతుదారుల సిద్ధాంతం అన్నీ “ఒకటే” అయినప్పుడు.. ప్రభుత్వ లోపాలను సైద్ధాంతికంగా ఎండగట్టేదెవరు? విభిన్నమైన, ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల ముందు ఉంచేదెవరు? ముఖాలు మారాయి కానీ భావజాలం మారని ఈ “అడ్జస్ట్మెంట్ రాజకీయాల” చదరంగంలో..**”అసలు నిజమైన ప్రతిపక్షం ఎక్కడ?”**అన్నది ఇప్పుడు తమిళనాట ప్రజాస్వామ్య పునాదులను కుదిపేస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న!**
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపాలు. నాయకులు చెప్పే సిద్ధాంతాలు, వారు ఇచ్చే హామీలను నమ్మి ఓటరు తన తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తాడు. కానీ, తీర్పు వెలువడిన తర్వాత ఆ సిద్ధాంతాలు గాలిలో కలిసిపోయి, కేవలం ‘అధికారం’ మాత్రమే పరమావధిగా మారితే? సరిగ్గా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఇదే జరుగుతోంది. 2026 శాసనసభ ఎన్నికలు రాజకీయ అవకాశవాదానికి, అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్‌కు పరాకాష్ఠగా నిలిచాయి. “మార్పు” అనే నినాదంతో వచ్చిన కొత్త శక్తి, అధికారం కోసం పాత కూటములతో చేతులు కలపడం, నిన్నటి బద్ధ శత్రువులు నేటి మిత్రులుగా మారడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా, తీవ్ర విమర్శలకు తావిచ్చే అంశంగా మారింది.
**సిద్ధాంతాల ముసుగులో ఎన్నికల సమరం**
ఎన్నికలకు ముందు తమిళనాడులో ప్రధానంగా మూడు పక్షాలు పోరాడాయి. దశాబ్దాల ద్రావిడ పాలనకు, అవినీతికి వ్యతిరేకంగా తాము స్వచ్ఛమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ఒంటరిగా బరిలోకి దిగింది. మరోవైపు డీఎంకే (DMK) నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) లో కాంగ్రెస్, వామపక్షాలు (CPI, CPM), ముస్లిం లీగ్ (IUML) తదితర పార్టీలు కలిసి పోటీ చేశాయి.ఎవరి సిద్ధాంతాలు వారివి, ఎవరి నినాదాలు వారివి అన్నట్టుగా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల ముందుకు వెళ్లారు.
**రాత్రికి రాత్రే ప్లేటు మార్చిన పాత మిత్రులు**
ఫలితాలు రాగానే ఏ ఒక్క పార్టీకి 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో (టీవీకే కి 108 సీట్లు రావడం) అసలు నాటకం మొదలైంది.డీఎంకే కూటమిలో ఉండి, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎం.కే. స్టాలిన్ బొమ్మతో ఓట్లు అడిగిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే , ఐయూఎంఎల్ పార్టీలు.. ఎన్నికల తర్వాత ఏమాత్రం సంకోచం లేకుండా అధికార టీవీకే వైపు జంప్ చేశాయి.దశాబ్దాల నాటి డీఎంకే కూటమిని పక్కనపెట్టి, కేవలం అధికారంలో భాగస్వామ్యం కోసం చేసిన అవకాశవాద రాజకీయమే ఇదని విశ్లేషకులు ముక్తకంఠంతో విమర్శిస్తున్నారు.
**లౌకికవాదమా? లేక మతతత్వ రాజకీయాల కలయికా?**
ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సిద్ధాంతాల వైరుధ్యం. టీవీకే, వామపక్షాలు, కాంగ్రెస్ తమను తాము కరుడుగట్టిన లౌకికవాద (Secular) పార్టీలుగా చెప్పుకుంటాయి. కానీ ఇప్పుడు వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు తీసుకున్న పార్టీలలో ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ (IUML) కూడా ఉంది.ఈ పార్టీ ప్రాథమికంగా ముస్లిం కమ్యూనిటీ ప్రయోజనాల రక్షణ, ఇస్లామిక్ ప్రజాస్వామ్యం అనే మతపరమైన పునాదుల మీద నడుస్తుంది. మతతత్వ పార్టీలకు దూరంగా ఉంటామని బహిరంగంగా ప్రకటించే లౌకిక పార్టీలు, తీరా అధికారం కోసం ఒక మతం పేరుతో ఉన్న పార్టీతో జట్టు కట్టడం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది.
**పేర్లు వేరు, సిద్ధాంతం ఒకటే!**
విజయ్ తన ఎన్నికల ప్రచారంలో డీఎంకేను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ నిశితంగా పరిశీలిస్తే, అధికారంలో ఉన్న టీవీకే , ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే మూల సిద్ధాంతాలు దాదాపు ఒకటే.సామాజిక న్యాయం, లౌకికవాదం, ద్విభాషా విధానం, రాష్ట్ర స్వయంప్రతిపత్తి.. ఇవే రెండు పార్టీల ప్రధాన అజెండాలు.కేవలం “కుటుంబ పాలన, అవినీతి” అనే ముద్రను డీఎంకే పై వేసి టీవీకే అధికారంలోకి వచ్చింది తప్ప, సైద్ధాంతికంగా ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు. ఇక మూడవ స్థానంలో ఉన్న అన్నా డీఎంకే (AIADMK) కూడా ఇదే తరహా మృదువైన ద్రావిడవాదాన్ని నమ్ముతుంది.
**కనుమరుగవుతున్న నిజమైన ప్రతిపక్ష గళం**
ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి పూర్తి భిన్నమైన సిద్ధాంతాలు, ప్రత్యామ్నాయ ఆర్థిక, సామాజిక విధానాలు ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉంటేనే చట్టసభల్లో అర్థవంతమైన చర్చ జరుగుతుంది. కానీ తమిళనాడులో ఇప్పుడు అధికార పార్టీ (TVK), ప్రధాన ప్రతిపక్ష పార్టీ (DMK) రెండూ ఒకే చెట్టు కొమ్మల్లాగా పెరియార్, అంబేద్కర్, కామరాజర్ సిద్ధాంతాలనే నమ్ముతున్నాయి.దీనికి తోడు డీఎంకే పాత మిత్రులే ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే సైద్ధాంతిక ప్రతిపక్షం అసెంబ్లీలో కరువైందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
**’మార్పు’ కోరిన ఓటరుకు మొండిచెయ్యి**
తమిళనాడు ప్రజలు దశాబ్దాల ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి విసిగిపోయి, ఒక స్వచ్ఛమైన మార్పు కోసం టీవీకే కి అఖండమైన మద్దతు ఇచ్చారు. పాత రాజకీయాలు, పాత కూటములు వద్దు అనుకున్నారు. కానీ విజయ్ ముఖ్యమంత్రి అవ్వడానికి మళ్లీ అదే పాత డీఎంకే కూటమిలోని పార్టీల (కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్) మద్దతు తీసుకోవాల్సి వచ్చింది.అంటే ప్రజలు ఏ రాజకీయ పక్షాలను అయితే తిరస్కరించారో, మళ్లీ వారే టీవీకే వెనుక ఉండి ప్రభుత్వాన్ని శాసిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
**తెరవెనుక ‘అడ్జస్ట్మెంట్’ పాలిటిక్స్**
ఎన్నికలకు ముందు ఒకరినొకరు తిట్టుకోవడం, ఎన్నికల తర్వాత అధికారం కోసం తెరవెనుక ఒప్పందాలు చేసుకోవడాన్నే రాజకీయ పరిభాషలో “అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్” అంటారు. తమిళనాడులో ఇప్పుడు స్పష్టమైన మెజారిటీ ఏ ఒక్కరికీ రాకపోవడంతో, నిన్నటిదాకా శత్రువుల్లా ఉన్నవారు నేడు మిత్రులుగా మారిపోయారు. అధికారం చేజారిపోకుండా చూసుకోవడానికి పార్టీలు తమ మూల సిద్ధాంతాలను గాలికొదిలేసి, పదవుల కోసం రాజీపడ్డాయి. ఈ తెరవెనుక రాజకీయాలు ఓటరును తీవ్ర నైరాశ్యానికి గురిచేస్తున్నాయి.
**ఇది ప్రజాస్వామ్యమా?లేక ప్రజల పట్ల ప్రహసనమా?**
పార్టీల ఈ ఊసరవెల్లి రాజకీయాలు అంతిమంగా ప్రజలను నిలువునా వంచించడమే అవుతుంది. ఒక కూటమి పేరుతో ఓట్లు అడిగి గెలిచిన ఎమ్మెల్యేలు, ఫలితాల తర్వాత రాత్రికి రాత్రే అవకాశవాదంతో మరో పార్టీకి మద్దతు తెలపడం నైతికంగా ఎంతవరకు సబబు? సైద్ధాంతిక పవిత్రత (Ideological Purity) గురించి గొప్పగా మాట్లాడే నాయకులు, అధికారం కోసం ఏమైనా చేస్తారని 2026 ఎన్నికలు రుజువు చేశాయి. ఎన్నికల ముందు విడిగా ఉండి.. తర్వాత అంతా ఒక్కటే అని చేతులు కలపడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే అని సగటు ఓటరు ఆవేదన చెందుతున్నాడు.
**గడల నరసింహారావు,సీనియర్ జర్నలిస్ట్ ఖమ్మం**







