జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు అగ్రనేత ‘నరహరి’.
* నాలుగు దశాబ్దాల అజ్ఞాతానికి స్వస్తి
* పోలీసుల ఎదుట భార్యతో కలిసి లొంగుబాటు.
* రూ.20 లక్షల రివార్డు.. నాలుగు దశాబ్దాల ప్రస్థానం.
* ఉక్కిరిబిక్కిరి చేసిన కూంబింగ్..
హైదరాబాద్, మహా.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో కొనసాగి, సుదీర్ఘకాలంగా అజ్ఞాత జీవితం గడిపిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ జనజీవన స్రవంతిలో కలిశారు. వయోభారం, అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ముమ్మర కూంబింగ్ నేపథ్యంలో ఆయన తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అత్యంత కీలక నేతగా ఉన్న నరహరి తలపై ప్రభుత్వం ఏకంగా రూ. 20 లక్షల భారీ రివార్డు ప్రకటించి ఉండటం గమనార్హం.
హనుమకొండ జిల్లా కాజీపేట పరిధిలోని సోమిడి గ్రామానికి చెందిన నరహరి.. డిగ్రీ చదివే రోజుల్లోనే వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. అప్పటి పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, మరో నాయకుడు క్రాంతి రణదేవ్ మాటల ప్రభావంతో ఆయన నక్సలిజం వైపు అడుగులు వేశారు. తన టీనేజ్ వయసులోనే దళంలో చేరిన ఆయన, పోలీసు రికార్డుల ప్రకారం 1996లో అంటే సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నాటి నుంచి నేటి వరకు ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు ఆయన సాక్షిగా నిలిచారు.
ప్రస్తుతం 57 ఏళ్ల వయసున్న నరహరి.. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి వివిధ విభాగాలకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ప్రధానంగా జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరోకు చెందిన టెక్నికల్ విభాగంలో ఆయన అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో జార్ఖండ్ రాష్ట్రంలోని దట్టమైన సరండా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు యాంటీ నక్సల్స్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాని లక్ష్యంగా చేసుకుని పోలీసులు, పారామిలటరీ బలగాలు కూంబింగ్ ఆపరేషన్లను తీవ్రతరం చేశాయి.
భద్రతా బలగాల గాలింపు చర్యలతో అటవీ ప్రాంతంలో ఉక్కిరిబిక్కిరి అయిన నరహరి దంపతులు.. తప్పనిసరి పరిస్థితుల్లో అజ్ఞాత జీవితాన్ని వీడి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. దశాబ్దాల పాటు పార్టీలో అగ్రస్థానంలో కొనసాగిన, పైగా సాంకేతిక విభాగంపై పూర్తి పట్టున్న సీనియర్ నేత లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. లొంగిపోయిన నరహరి దంపతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పించనున్నట్లు తెలుస్తోంది.








