Mahaa Daily Exclusive

  హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్…

Share

  • హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్
  • మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పాటు కేసు కొట్టి వేయాలని వినతి
  • వెకేషన్ బెంచ్ ముందుకు పిటిషన్
  • రేపు విచారమకు వచ్చే అవకాశం
  • రంగంలోకి దిగిని సిట్, విచారణ వేగవంతం
  • భగీరథ్ కనిపించడం లేదన్న సిట్ డీసీపీ రితిరాజ్

హైదరాబాద్, మహా : పెను సంచలనం సృష్టించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ పోక్సో కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటికే తమను హనీట్రాప్ చేశారంటూ బండి భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాజాగా తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు. తనపై పోలీసులు పెట్టిన పోక్సో కేసును కొట్టేయాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే బండి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్.. ఈనెల 14వ తేదీన హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారణకు రానుంది. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో ఈ పిటిషన్ వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లనుంది.

మరోవైపు.. ఈ కేసులో సిట్ అధికారులు.. మరింత లోతైన దర్యాప్తును చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఆలస్యం అవుతోందంటూ వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సోమవారం డీజీపీ సీవీ ఆనంద్‌కు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు.. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే బాధితురాలి స్టేట్‌మెంట్‌ను ఇప్పటికే తీసుకున్నారని, మరిన్ని విషయాల కోసం మరోసారి వారి నుంచి స్టేట్‌మెంట్ తీసుకుంటామని సిట్ చీఫ్ రితిరాజ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఆచూకీ కనిపించడం లేదని, తప్పకుండా పట్టుకుంటామని తేల్చి చెప్పారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. తన 17 ఏళ్ల కుమార్తెను బండి భగీరథ్‌ వేధిస్తున్నాడని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 8వ తేదీన పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని, ఒకవేళ బండి భగీరథ్‌పై నేరం రుజువైతే కచ్చితంగా అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.

మైనర్ బాలిక, ఆమె తల్లి కలిసి తనను హనీట్రాప్ చేశారని, డబ్బుల కోసం బెదిరింపులకు దిగుతున్నారంటూ బండి భగీరథ్‌ ఈనెల 8వ తేదీనే కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.