Mahaa Daily Exclusive

  విద్యా వ్యవస్థపై లీకేజీ ఉగ్రరూపం….

Share

* విద్యా వ్యవస్థపై లీకేజీ ఉగ్రరూపం.
* 22 లక్షల మంది డాక్టర్ల కలల సమాధి!
* కసాయి చేతుల్లో కాబోయే డాక్టర్ల భవిత.
* కోటా కేంద్రంగా పేపర్ల బేరసారాలు.
* రాజస్థాన్ కేంద్రంగా ‘నీట్’ మహా కుంభకోణం.
* రెండు లక్షలకు డాక్టర్ సీటు గ్యారెంటీ.
* 42 గంటల ముందే వాట్సాప్‌లో వల.
* సీబీఐ చేతికి లీకేజీ దర్యాప్తు.
* రూపాయి ఖర్చు లేకుండా మళ్లీ పరీక్ష

హైదరాబాద్, మహా.

**దేశ విద్యావ్యవస్థ నడిబొడ్డున పేలిన ‘నీట్’ బాంబు యావత్ జాతిని నిలువునా దహించివేస్తోంది. కళ్లు కాయలు కాసేలా చదివిన 22 లక్షల మంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల ఆశల గొంతును లీకేజీ రాబందులు అత్యంత కిరాతకంగా నులిమేశాయి. అహర్నిశలు శ్రమించిన అభాగ్యుల భవితను బలిపీఠం ఎక్కించి, దళారుల జేబులు నింపిన ఈ మహా కుంభకోణం విద్యావ్యవస్థకే పట్టిన అతిపెద్ద పీడకల. ప్రాణాలు పోసే పవిత్రమైన వైద్య వృత్తిని, కాసుల కోసం అంగట్లో సరుకులా మార్చేసిన మాఫియా మృగాల దాహానికి నిలువునా బలైంది విద్యార్థుల పవిత్రమైన కలలు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఈ చీకటి దందాపై సర్వత్రా ఆగ్రహజ్వాలలు రగులుకుంటున్నాయి.తప్పును కప్పిపుచ్చుకోలేక, విద్యార్థుల కన్నీటి సెగలకు ఉక్కిరిబిక్కిరైన కేంద్ర ప్రభుత్వం.. ఎట్టకేలకు దిగివచ్చి పరీక్షను రద్దు చేయడంతో పాటు, ఈ పాపానికి కారణమైన గద్దల రెక్కలు విరిచేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది**

అత్యంత ప్రతిష్టాత్మక వైద్య విద్యా ప్రవేశ పరీక్ష ‘నీట్-యూజీ 2026’ పవిత్రత మంటగలిసింది. ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్ష నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయన్న పక్కా ఆధారాలు లభించడంతో దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించిన పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఏళ్ల తరబడి అహర్నిశలు శ్రమించి చదివిన దాదాపు 22.79 లక్షల మంది విద్యార్థుల ఆశలపై లీకేజీ మాఫియా నీళ్లు చల్లింది. వ్యవస్థపై నమ్మకం సడలకుండా, విద్యార్థులకు న్యాయం చేసే దిశగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్షను రద్దు చేసి, మళ్లీ పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర నిఘా, పోలీసు వర్గాల నుంచి అందిన ప్రాథమిక నివేదికల ఆధారంగా ఈ మహా కుంభకోణంపై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

**వాట్సాప్‌లో అంగడి సరుకులా ప్రశ్నాపత్రం..**

లీకేజీ వ్యవహారంపై రాజస్థాన్ పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. దేశంలోనే అతిపెద్ద కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్‌లోని ‘కోటా’ కేంద్రంగా ఈ లీకేజీ దందా సాగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పరీక్షకు ఏకంగా 42 గంటల ముందే రాజస్థాన్‌లోని సికార్‌లో వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టినట్లు నిర్ధారణ అయింది. కోటాలోని కొన్ని కోచింగ్ సెంటర్లు విద్యార్థులకు పంపిణీ చేసిన మెటీరియల్‌లో.. అసలు ప్రశ్నపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు యథాతథంగా ప్రత్యక్షం కావడం దర్యాప్తు అధికారులను సైతం నివ్వెరపరిచింది. ముఖ్యంగా కెమిస్ట్రీ విభాగంలో 120కి పైగా ప్రశ్నలు ఆ మెటీరియల్‌లో అచ్చుగుద్దినట్లు ఉన్నాయని రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ వెల్లడించారు. ఈ లీకైన ప్రశ్నాపత్రాన్ని మాఫియా ముఠాలు రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు బహిరంగంగా విక్రయించాయి. కొందరి వద్ద ఏకంగా రూ.30 వేలకు పైగా అడ్వాన్స్‌లు వసూలు చేసిన బాగోతం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇప్పటికే పలువురు కీలక అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

**ఉచితంగానే రీ-ఎగ్జామ్.. ఫీజులన్నీ వాపస్**

మే 3న దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో కలిపి 5,400కు పైగా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను నమ్ముకుని దాదాపు 22.79 లక్షల మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎన్టీఏ కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. గతంలో చెల్లించిన పరీక్ష ఫీజు మొత్తాన్ని విద్యార్థులకు రీఫండ్ చేయనున్నట్లు వెల్లడించింది. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, సంస్థ సొంత నిధులతోనే పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తుందని స్పష్టం చేసింది. త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొత్త తేదీలు, అడ్మిట్ కార్డుల వివరాలను ప్రకటిస్తామని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, సీబీఐ విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని ఎన్టీఏ వర్గాలు స్పష్టం చేశాయి. పారదర్శకతే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ప్రకటించాయి.