Mahaa Daily Exclusive

  శబరిమల ప్రవేశం మనస్సాక్షికి సంబంధించిన విషయం…

Share

శబరిమల ప్రవేశం మనస్సాక్షికి సంబంధించిన విషయం.
* నిషేధంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు.
* ప్రజలు కోరుకుంటేనే సామాజిక సంస్కరణలు.
* చట్టసభల నిర్ణయాన్నే అంగీకరిస్తామన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.
* ఆలయ ప్రవేశంపై అంటరానితనం మీ దృష్టికోణంలోనే ఉంది.
* భక్తుల మనస్సాక్షే గీటురాయి: జస్టిస్ బీవీ నాగరత్న.
* శబరిమల కేసులో అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘ మథనం.
* 9 మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విచారణలో ఆసక్తికర వాదనలు.
హైదరాబాద్, మహా.
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి రుతుక్రమ వయసు గల మహిళల ప్రవేశం, శతాబ్దాల నాటి మతపరమైన ఆచారాలపై సుప్రీంకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం నిషిద్ధమా కాదా అన్నది అంతిమంగా వ్యక్తిగత మనస్సాక్షికి సంబంధించిన విషయమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ ప్రతిష్టాత్మక కేసుపై సుదీర్ఘ విచారణ జరిపింది. శబరిమల ఆలయంతో పాటు దావూదీ బోహ్రాల వంటి పలు మతాల్లో పాటిస్తున్న మత స్వేచ్ఛ పరిధి, ప్రార్థనా స్థలాల్లో మహిళలపై కొనసాగుతున్న వివక్షకు సంబంధించిన పిటిషన్లపై ధర్మాసనం లోతైన విశ్లేషణ చేసింది.
ఈ సాంప్రదాయక ఆచారానికి సామాజిక సంస్కరణలు అవసరమని ఈ దేశ ప్రజలు తమ ద్వారా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ద్వారా సమష్ఠిగా నిర్ణయిస్తే, అటువంటి సంస్కరణలను న్యాయస్థానం మనస్ఫూర్తిగా అంగీకరించే అవకాశం ఉందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అయితే, ఆ చట్టసభల నిర్ణయం ప్రజల అభీష్టానికి, కోరికలకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం న్యాయస్థానం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఏదైనా రాష్ట్రం అన్ని వయసుల మహిళలకు ఆలయ ప్రవేశాన్ని అనుమతిస్తూ చట్టం చేస్తే దానిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 (బి) ఉల్లంఘన కింద కొట్టివేయవచ్చా అన్న న్యాయవాదుల ప్రశ్నకు సీజేఐ పై విధంగా బదులిచ్చారు. ఇలాంటి సున్నితమైన అంశాల్లో న్యాయస్థానాలు భవిష్యత్తులో తీర్పులు వెలువరించడానికి సైతం సంకోచించే పరిస్థితులు వస్తాయని ఆయన విశ్లేషించారు.
విచారణ సందర్భంగా కొన్ని పక్షాల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది విజయ్ హన్సరియా అత్యంత ఆసక్తికరమైన వాదనలు వినిపించారు. మహిళలపై ఆంక్షలు విధించడానికి వారి రుతుక్రమ వయసే అసలు సమస్య అని కోర్టు దృష్టికి తెచ్చారు. తనను తాను ఒక పదేళ్ల బాలికగా ఊహించుకుని ఆయన వాదనలు వినిపించారు. రుతుక్రమం వయసొచ్చిన తర్వాత ఆలయానికి వెళ్లడం నిషిద్ధం అనడాన్ని తాను అంగీకరించబోనని, అది ఏమాత్రం కళంకం కాదని పేర్కొన్నారు. సామాజిక సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చట్టం (ఆర్టికల్ 25) చేస్తే, అది కేవలం మతపరమైన ఆచారాలను ప్రభావితం చేస్తుందన్న ఏకైక కారణంతో దానిని కొట్టివేయరాదని విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ ముక్కుసూటి వ్యాఖ్యలు చేశారు. “పదేళ్ల వయసులో ఆలయంలోకి ప్రవేశించడాన్ని మీరు నిషిద్ధంగా భావిస్తే అది నిషిద్ధమే అవుతుంది.. అలా భావించకపోతే అది ఏమీ కాదు. ఆ విషయాన్ని మీరు ఎలా చూస్తారన్నదే అసలు ప్రశ్న. అది పూర్తిగా ఒక భక్తుడు లేదా భక్తుడు కాని వారి మనస్సాక్షిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ మనస్సాక్షిని అనుసరించాలి” అని జస్టిస్ నాగరత్న విశ్లేషించారు.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి పది నుంచి యాభై ఏళ్ల లోపు వయసున్న మహిళల ప్రవేశంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని 2018లో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎత్తివేసిన విషయం విదితమే. ఆ చారిత్రాత్మక తీర్పుపై దేశవ్యాప్తంగా భిన్నభిప్రాయాలు వ్యక్తం కావడంతో పాటు, ఆచారాలను కాపాడాలంటూ పెద్ద ఎత్తున రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ ప్రసన్న బీ వరాలే, జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీలతో కూడిన తొమ్మిది మంది సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసి సుదీర్ఘ విచారణను కొనసాగిస్తోంది.