Mahaa Daily Exclusive

  విజయ్ సర్కార్‌కు హైకోర్టు ‘బ్రేక్’…..

Share

విజయ్ సర్కార్‌కు హైకోర్టు ‘బ్రేక్’.
* బలపరీక్షలో పాల్గొనవద్దని టీవీకే ఎమ్మెల్యేకు సంచలన ఆదేశం
* *ఒక్క ఓటు గండం.. ‘దళపతి’కి న్యాయస్థానం దెబ్బ.
* తిరుపత్తూరు ఎమ్మెల్యేపై ఓటింగ్‌ నిషేధం.
* మద్రాసు హైకోర్టు తీర్పుతో ఒక్క ఓటు తగ్గనున్న విజయ్ బలం.
*రాజకీయ చదరంగంలో కోర్టు మార్కు ఝలక్.
హైదరాబాద్, మహా.
తమిళనాడు రాజకీయ రణక్షేత్రంలో బలపరీక్షకు సర్వం సిద్ధమవుతున్న వేళ, న్యాయస్థానం వెలువరించిన ఒక మధ్యంతర ఉత్తర్వు టీవీకే శిబిరంలో కలకలం రేపింది. కేవలం ‘ఒక్క ఓటు’ మెజారిటీతో గెలిచిన తిరుపత్తూరు టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో జరగనున్న అత్యంత కీలకమైన విశ్వాస తీర్మానం ఓటింగ్‌లో ఆయన పాల్గొనవద్దని న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరి, జస్టిస్ ఎన్. సెంథిల్‌కుమార్లతో కూడిన ధర్మాసనం ఆదేశించడం విజయ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో జరిగిన అవకతవకలు, ఒక నియోజకవర్గ ఓటును మరోచోటికి బదిలీ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్నికల విజయంపైనే నీలినీడలు కమ్ముకున్న వేళ, సభలో బలనిరూపణకు సిద్ధమవుతున్న విజయ్‌కు ఒక ఓటు తగ్గడం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

**బలపరీక్షకు ముందే టీవీకేకు న్యాయపరమైన చిక్కులు**
తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన టీవీకే ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండగా, మద్రాసు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వ వర్గాలను ఆందోళనలో పడేశాయి. శివగంగై జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటింగ్‌లో పాల్గొనకుండా కోర్టు ఆంక్షలు విధించింది. 17వ శాసనసభలో నిర్వహించనున్న ఏ అంశంపైన అయినా సరే ఆయన ఓటు వేయకూడదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియకరుప్పన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ఎన్నికల ప్రక్రియలో జరిగినట్లుగా చెబుతున్న అవకతవకలపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని గమనించింది. అన్ని పోస్టల్ బ్యాలెట్‌లతో పాటు కౌంటింగ్ కేంద్రంలోని వీడియో ఫుటేజీని కూడా భద్రపరచాలని ఆదేశించి, తదుపరి విచారణను వాయిదా వేసింది.
**ఒక్క ఓటు వ్యత్యాసం.. డీఎంకే ఆరోపణలు**
తిరుపత్తూరు నియోజకవర్గ ఫలితం మొదటి నుంచీ వివాదాస్పదంగానే మారింది. ఇక్కడ డీఎంకే నేత పెరియకరుప్పన్‌కు 83,374 ఓట్లు రాగా, టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతికి 83,375 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో సేతుపతి విజేతగా నిలిచారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో భారీగా అక్రమాలు జరిగాయని, శివగంగై జిల్లా పరిధిలోని 185వ పోలింగ్ కేంద్రం ఓటును వెల్లూరు జిల్లాలోని మరో నియోజకవర్గానికి అక్రమంగా బదిలీ చేశారని పెరియకరుప్పన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించి రీకౌంటింగ్ నిర్వహించాలని, అప్పటివరకు సేతుపతిని ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరారు.
**ఎన్నికల సంఘం వాదనను తోసిపుచ్చిన కోర్టు**
ఈ విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తమ చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఒకసారి లెక్కింపు ప్రారంభమైన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఏ ఓటు కూడా మరో నియోజకవర్గానికి బదిలీ కాలేదని కమిషన్ వాదించింది. అయితే, పిటిషనర్ సమర్పించిన సాక్ష్యాధారాలు బలమైన సందేహాలను కలిగిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఒక్క ఓటు తేడాతోనే జయాపజయాలు నిర్ణయించబడినందున, న్యాయం జరగాలంటే ఎమ్మెల్యే ఓటు హక్కుపై ఆంక్షలు అవసరమని ధర్మాసనం భావించింది. ఈ క్రమంలోనే బలపరీక్ష ఓటింగ్‌లో సేతుపతి పాల్గొనకుండా నిరోధించింది.
**విజయ్ సర్కార్ లెక్కల్లో మార్పులు**
మద్రాసు హైకోర్టు తాజా ఆదేశాలతో అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వ బలం ఒకటి తగ్గనుంది. 234 స్థానాలున్న తమిళనాడు శాసనసభలో సాధారణంగా మ్యాజిక్ ఫిగర్ 118గా ఉంటుంది. ప్రస్తుతం విజయ్‌కు తన సొంత పార్టీ మరియు మద్దతుదారులతో కలిపి 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. తాజా తీర్పుతో అది 119కి చేరనుంది. అయితే, మెజారిటీకి కావాల్సిన 118 మంది మద్దతు విజయ్‌కు ఇంకా ఉన్నప్పటికీ, అధికారికంగా ఒక ఎమ్మెల్యే ఓటును కోల్పోవడం రాజకీయంగా విమర్శలకు తావిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్‌కు అండగా ఉంటామని ప్రకటించడం ఆయనకు ఊరటనిచ్చే అంశం. ఏది ఏమైనా, ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యేకు ఓటు వేసే అవకాశం లేకపోవడం, ఆ ఒక్క ఓటుతోనే ప్రభుత్వం గట్టెక్కే పరిస్థితులు ఉంటే అది తీవ్ర ఉత్కంఠకు దారితీసే అవకాశం ఉంది. బుధవారం జరిగే బలపరీక్ష తమిళ రాజకీయాల్లో ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.