కల్వకుంట్ల కవితకు రైల్వే కోర్టు సమన్లు.
* నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశం.
* బీసీ రిజర్వేషన్ల పోరులో కేసు.
* కవిత సహా 13 మందికి రైల్వే కోర్టు పిలుపు.
*కామారెడ్డి రైల్ రోకో కేసులో కదలిక.
• నాటి ఆందోళన కేసులో రేపు విచారణ.
హైదరాబాద్, మహా.
వెనుకబడిన వర్గాల (బీసీ) రిజర్వేషన్ల సాధన కోసం గతంలో నిర్వహించిన ‘రైల్ రోకో’ ఆందోళన కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు కల్వకుంట్ల కవితకు తాజాగా సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి రేపు సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఎదుట విచారణకు స్వయంగా హాజరుకావాలని న్యాయస్థానం ఆ సమన్లలో స్పష్టం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కవిత ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే.
నాడు కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రైలు పట్టాలపై బైఠాయించి నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారనే ఆరోపణలతో కవితపై రైల్వే పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ ఆందోళనలో క్రియాశీలకంగా పాల్గొన్న కవితతో పాటు మరో 12 మంది నేతలపై కూడా రైల్వే చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే కోర్టు తాజాగా కవితకు, ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణ నిమిత్తం కోర్టుకు విధిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేయడంతో, రేపు జరగనున్న విచారణకు కవిత హాజరవుతారా అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.








