“నన్ను కెలికారు.
* నా కుటుంబానికి పెట్టిన నిప్పుతో మీ సామ్రాజ్యాలనే తగలబెడతా.
* కొడుకుకు టైమ్ ఇవ్వలేకపోయినందుకు నన్ను క్షమించండి.
*తప్పు చేస్తే నా కొడుకైనా శిక్ష అనుభవించాల్సిందే.
* హనుమాన్ జయంతి వేళ బండి సంజయ్ ఉద్వేగభరిత ప్రసంగం.
* బండి సంజయ్ ఒక హిందూ ధర్మ రక్షకుడు.
* హిందువులకు హంపి పీఠాధిపతి పిలుపు.
హైదరాబాద్, మహా.
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర జన ప్రభంజనాన్ని తలపించింది. వైశ్యా భవన్ నుండి ప్రారంభమైన ఈ యాత్రలో వేలాది మంది కాషాయ శ్రేణులు, హిందుత్వ వాదులు పాల్గొనడంతో కరీంనగర్ వీధులు జనసంద్రమయ్యాయి. ఈ యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసిన **హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి** మాట్లాడుతూ, బండి సంజయ్ హిందూ ధర్మ పరిరక్షకుడని, ఆయనకు ప్రతి హిందువు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగం అత్యంత ఉద్వేగభరితంగా సాగింది.
తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై సంజయ్ సూటిగా స్పందించారు. “ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు, కానీ నిజానిజాలు కోర్టులే తేలుస్తాయి. ఒకవేళ తప్పు చేసినట్లు తేలితే వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే, కోర్టు నిర్ణయమే నాకు శిరోధార్యం” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడిని తాను సమర్థించడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోవచ్చని కుండబద్దలు కొట్టారు.
తన వ్యక్తిగత జీవితంలోని లోటును సంజయ్ ప్రజల ముందు ఉంచారు. “సమాజమే నా కుటుంబం అనుకున్నాను. హార్ట్‌లో స్టంట్ ఉన్నా లెక్కచేయకుండా 1600 కిలోమీటర్లు నడిచాను. 109 కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడలేదు. కానీ, ఈ పోరాటంలో నా కొడుకుకు తగినంత సమయం ఇవ్వలేకపోయాను. వాడు ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ఉండటానికి కారణం నా తప్పు కూడా ఉండొచ్చు. నన్ను క్షమించండి” అని తెలంగాణ సమాజాన్ని కోరారు. తన భార్య కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ తన బాటలోనే నడుస్తోందని గుర్తు చేశారు.
తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. “నన్ను కెలికారు, నా కుటుంబానికి నిప్పంటించారు. రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెడితే లంక దహనమైనట్లే, నా కుటుంబానికి మీరు పెట్టిన నిప్పుతోనే మీ అవినీతి సామ్రాజ్యాలను, గడీలను బద్దలు కొడతాను. నా కుటుంబాన్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలిపెట్టను” అని హెచ్చరించారు.
ప్రసంగం మధ్యలో స్టేజీపై ఉన్న లైట్ల కాంతి గురించి ప్రస్తావిస్తూ, “ఈ లైట్ల ఫోకస్ వల్ల కళ్లలో నీళ్లు వస్తే బండి సంజయ్ ఏడుస్తున్నాడని అనుకోకండి. నేను భయపడే రకం కాదు, కంటతడి పెట్టే రకం కాదు. హిందూ ధర్మం కోసం నా చివరి శ్వాస వరకు పోరాడుతాను” అని ధీమా వ్యక్తం చేశారు. 29 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల సమయంలో ఆ కుటుంబాలు పడ్డ బాధను కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ ఏక్తా యాత్రలో వినూత్న రీతిలో ప్రదర్శించిన కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొత్తం మీద బండి సంజయ్ చేసిన ఈ ప్రసంగం అటు సానుభూతిని, ఇటు రాజకీయ వేడిని సమానంగా రగిల్చింది.








