Mahaa Daily Exclusive

  కోట్ల వసూళ్ల భ్రమల్లో టాలీవుడ్……

Share

కోట్ల వసూళ్ల భ్రమల్లో టాలీవుడ్.
* థియేటర్ల ఉసురు తీస్తున్న ఆ ‘మూడు’.
* రూపాయి పోయే.. పావలా మిగిలే.
* అసలు రోగాన్ని వదిలేసి వాటాల కోసం కోట్లాట.
* పాతాళానికి సినిమా.. ప్రాణాపాయంలో థియేటర్!
* ప్రేక్షకుడి జేబుకు చిల్లు.. డిస్ట్రిబ్యూటర్లకు శఠగోపం.
* పతనాన్ని శాసిస్తున్న ఆ నాలుగు తప్పులు!

హైదరాబాద్, మహా.

ఒకప్పుడు సినిమా అంటే సామాన్యుడికి అతిపెద్ద వినోదం. వారాంతం వస్తే చాలు థియేటర్ల ముందు పండుగ వాతావరణం కనిపించేది. కానీ నేడు ఆ వినోదం సామాన్యుడికి అందని ద్రాక్షలా మారింది. ఏ పోస్టర్ చూసినా వందల కోట్ల రూపాయల వసూళ్ల ప్రచారమే కనిపిస్తోంది. కానీ, ఆ రికార్డుల వెనుక ఉన్న చేదు నిజం ఏమిటంటే.. అవి నిజంగా థియేటర్లకు పోటెత్తిన ప్రేక్షకుల వల్ల వచ్చినవి కావు. అవి కేవలం పెంచేసిన టికెట్ రేట్లు, ఇతర ధరలు పెంచడం వల్ల వచ్చినవని మనందరం అర్థం చేసుకోవాలి. సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయిన ప్రస్తుత తరుణంలో, వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం అతిపెద్ద తెలివితక్కువతనం. చిన్న సినిమాల ఆదాయం పావలా స్థాయికి పడిపోతే, ఇప్పుడు ఆ పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కొట్టుకుంటున్నారు తప్ప.. అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో ఎవరూ సమీక్షించుకోవడం లేదు. మూల సమస్యను వదిలేసి, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఎవరికీ లాభం లేదు.

**రికార్డుల హోరు.. రియాలిటీలో జీరో!**

ఈ రోజుల్లో పెద్ద సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ, థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల సంఖ్య (ఫుట్ ఫాల్స్) దారుణంగా పడిపోయింది. గతంలో ఒక సినిమా 50 కోట్లు కలెక్ట్ చేసిందంటే కోటి మంది ప్రేక్షకులు చూసేవారు. కానీ నేడు టికెట్ రేట్లు రూ.250 నుంచి రూ.300 వరకు పెంచేయడం వల్ల, కేవలం 30 లక్షల మంది చూసినా వంద కోట్ల గ్రాస్ వస్తోంది. అంటే మిగతా 70 లక్షల మంది ప్రేక్షకులు థియేటర్‌కు రావడం మానేశారన్న వాస్తవాన్ని ఇండస్ట్రీ కప్పిపుచ్చుకుంటోంది. పెద్ద సినిమాలకు ఆదాయం అర్ధ రూపాయికి పడిపోతే, చిన్న సినిమాల పరిస్థితి పావలాకు పడిపోయి దయనీయంగా మారింది.

**నాడు వెలుగులు.. నేడు చీకట్లు**

తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ఒకప్పుడు సుమారు 2,800 పైచిలుకు థియేటర్లు ఉంటే, నేడు ఆ సంఖ్య సుమారు 1,700 కు పడిపోయింది. నైజాం (తెలంగాణ) ఏరియాలో హైదరాబాద్‌ను మినహాయిస్తే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి జిల్లాల్లో కలిపి సుమారు 600 స్క్రీన్లు మాత్రమే మిగిలాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాంధ్ర (వైజాగ్, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు) పరిధిలో సుమారు 750 స్క్రీన్లు, సీడెడ్ (రాయలసీమ) పరిధిలో కేవలం 350 స్క్రీన్లు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. మల్టీప్లెక్సులు పెరుగుతున్నప్పటికీ, సామాన్యుడికి అందుబాటులో ఉండే సింగిల్ స్క్రీన్లు జిల్లాల వారీగా కుప్పకూలుతున్నాయి.

**లాభాలెంత? నష్టాలెంత? కళ్ల ముందు కనిపిస్తున్న కఠోర నిజం**

ప్రస్తుత బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఏడాదికి సుమారు 200 సినిమాలు విడుదలవుతుంటే, అందులో లాభాలు తెచ్చిపెట్టేవి కనీసం 10 నుంచి 15 శాతం కూడా ఉండటం లేదు. ఒక పెద్ద సినిమా హిట్ అయితే వందల కోట్లు కలెక్షన్లు వస్తున్నట్లు కనిపిస్తున్నా, అందులో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన భారీ పెట్టుబడులు తీసేస్తే మిగిలేది నామమాత్రపు లాభాలే. ఇక నష్టాల విషయానికొస్తే 85 శాతం సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. దీనివల్ల ప్రతీ వారం కోట్లాది రూపాయల పెట్టుబడి ఆవిరైపోతోంది. రూపాయి రావాల్సిన చోట కేవలం పావలా మాత్రమే వస్తుండటంతో సినిమా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.

**మూతపడుతున్న వినోద దేవాలయాలు**

నిర్మాతల తర్వాత అత్యంత దారుణంగా నష్టపోతున్నది సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లే. ఒక థియేటర్‌ను నిర్వహించాలంటే కరెంటు బిల్లులు, స్టాఫ్ జీతాలు, మెయింటెనెన్స్ కలిపి నెలకు కనీసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ ప్రేక్షకులు రాకపోవడంతో కనీసం కరెంటు బిల్లులు కూడా రాని పరిస్థితి నెలకొంది. వారం వారం డిజిటల్ ప్రొజెక్షన్ చార్జీలు కట్టుకోలేక, వచ్చే అరకొర కలెక్షన్లు మెయింటెనెన్స్‌కు సరిపోక ఎగ్జిబిటర్లు ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండేళ్లలో మరో 500 సింగిల్ స్క్రీన్లు కళ్యాణ మండపాలుగా, గోదాములుగా మారిపోవడం ఖాయం.

**కోట్ల పెట్టుబడి.. పావలా రాబడి**

ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అంటే సినిమాకు వెన్నెముక. కానీ నేడు వారు జూదగాళ్లుగా మారిపోయారు. సినిమా కంటెంట్ ఎలా ఉందో తెలియకుండానే, కేవలం హీరో ఇమేజ్, కాంబినేషన్ చూసి కోట్లాది రూపాయలు అడ్వాన్సులు (నన్-రిఫండబుల్, ఎంజీలు) చెల్లిస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయితే పెట్టిన పెట్టుబడిలో కనీసం పావలా వంతు కూడా వెనక్కి రావడం లేదు. పెద్ద సినిమాలు దెబ్బకొడితే డిస్ట్రిబ్యూటర్లు అప్పుల పాలవుతున్నారు. ఇక చిన్న సినిమాలను కొనే నాథుడే కరువవడంతో, ఆ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే సాహసం ఎవరూ చేయడం లేదు.

**పరిశ్రమను వెనక్కి లాగుతున్న ‘స్టార్’ డమ్**

ఈ దుస్థితికి అసలు మూలకారణాల్లో మొదటిది హీరోలు తీసుకుంటున్న సమయం. సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడంలో హీరోల పాత్ర అత్యంత కీలకం. ముఖ్యంగా తెలుగులో వారి ప్రభావం ఎక్కువే. కానీ ఇప్పుడున్న అగ్ర హీరోలు రెండు మూడేళ్లకు ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతోంది. హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తే థియేటర్లలో సందడి ఉంటుంది, క్యాంటీన్లలో వ్యాపారం జరుగుతుంది, చిన్న సినిమాలకు కూడా పరోక్షంగా ఊతం లభిస్తుంది. కానీ ఈ జాప్యం ఇండస్ట్రీని నిలువునా ముంచుతోంది.

**ప్రేక్షకుడికి శాపంగా మారిన వినోదం**

ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి రెండవ కారణం కేవలం 27 రోజుల్లోనే సినిమాలను ఓటీటీ లో విడుదల చేయడం. దీనివల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేసి ఇళ్లకే పరిమితమయ్యారు. దీనికి తోడు మూడవ కారణం కంటెంట్ లోపం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. ఇక నాలుగవది మల్టీప్లెక్సుల్లో నిలువు దోపిడీ. సినిమా టికెట్ కంటే అక్కడ అమ్మే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు విపరీతంగా ఉండటంతో సగటు మధ్యతరగతి కుటుంబం థియేటర్ మెట్లు ఎక్కాలంటేనే భయపడుతోంది.

**వాటాల పోరు మాని.. వ్యవస్థను బాగు చేయాలి**

కంటెంట్ అద్భుతంగా రాబట్టడం అనేది పూర్తిగా మన చేతుల్లో లేని సృజనాత్మక అంశం కావచ్చు. కానీ పైన చెప్పిన నాలుగు కారణాల్లో మూడు నేరుగా పరిశ్రమ చేతుల్లోనే ఉన్నాయి. హీరోల సినిమాల వేగం పెంచడం, ఓటీటీ రిలీజ్ విండోను కనీసం 50 రోజులకు పొడిగించడం, మల్టీప్లెక్స్ క్యాంటీన్ ధరల నియంత్రణ.. ఇవన్నీ పరిష్కరించదగినవే. ఈ మూడు అంశాలను సరిచేయకుండా, రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు. మూల సమస్యను వదిలేసి కుమ్ములాడుకోవడం వల్ల ఎవరికీ లాభం చేకూరదు. తక్షణమే ఇండస్ట్రీ పెద్దలు మేల్కొని ఈ వ్యవస్థాగత లోపాలను సరిదిద్దాలి. లేనిపక్షంలో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తు అంధకారమే అవుతుంది.