- మరో వేపాలీ గ్యాంగ్ దోపిడీ
- జవహర్ నగర్ లో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడీ
- వృద్ధ దంపతులపై దాడి బంగారము వెండి నగదుతో ఉడాయించిన దుండగులు…
కుషాయిగూడ, మహా : జూబ్లిహిల్స్ లో జరిగిన నేపాలీ గ్యాంగ్ దోపిడీ, హత్య కేసు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర శివార్లలోని జవహర్‌నగర్ రాణా పరిధిలోని కౌకుర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడి చేసింది. ఈ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న ప్రొ. మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్షీదంపతులను కట్టేసి దాడి చేసి మత్తుమందు ఇచ్చి నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. కోటి రూపాయల విలువైన బంగారం, వెండితో పాటు నగదును ఈ గ్యాంగ్ దోచుకుపోయింది. మంగళవారం మిట్ట మధ్యాహ్నం ఈ దంపతులు మత్తు నుంచి తేరుకుని గట్టిగా కిటికిలో నుంచి అరవడంతో.. ఇరుగు పొరుగు వారు వచ్చి ఆ ఇంటి తలుపులు తీశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నేపాల్‌కు చెందిన ఒక జంట రెండు వారాల క్రితమే తమ ఇంట్లో పని మనుషులుగా చేరారని ఈ దంపతులు పోలీసులకు వివరించారు. ఇటీవలే మరో మహిళ వచ్చి వారి బంధువుగా పరిచయమై తమ ఇంట్లో ఉంటోందని తెలిపారు. సోమవారం రాత్రి నేపాలీ మహిళ జన్మదిన వేడుకలు చేసుకుంటామంటే అందుకు అంగీకరించామని ఆ దంపతులు చెప్పారు. ఈ వేడుకలకు మరో ముగ్గురు బయట నుంచి వచ్చారని పేర్కొన్నారు. ఈ వేడుకల అనంతరం భోజనం చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చి తమపై ఈ నేపాలీ గ్యాంగ్ దాడి చేసిందని పోలీసులకు ఆ దంపతులు తెలిపారు. కాళ్లు, చేతులు కట్టేసి తమను బెదిరించడంతో.. మమ్మల్ని చంపకండి.. మీకు కావాల్సింది తీసుకెళ్లమని వారిని కోరినట్లు చెప్పారు. దీంతో ఇంట్లో నగలతోపాటు విలువైన వస్తువులను ఈ గ్యాంగ్ దోచుకుపోయిందన్నారు. అనంతరం ఇంట్లోని సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేసి.. అన్ని గేట్లకు తాళాలు వేసి వారు పరారయ్యారని వివరించారు. ఈ దోపిడీలో మొత్తం ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నారని చెప్పారు. ఆ ఇంటిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి పరిశీలించారు. దోపిడీ జరిగిన కాలనీలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు.








