Mahaa Daily Exclusive

  కరీంనగర్ దోపిడీ కేసులో వీడుతున్న మిస్టరీ….

Share

కరీంనగర్ దోపిడీ కేసులో వీడుతున్న మిస్టరీ.
* ‘జులాయి’ తరహాలో స్కెచ్.
* పోలీసుల చేతికి కీలక ఆధారం!
* దొరికిన ఫోన్.. విప్పిన గుట్టు.
* కరడుగట్టిన బీహార్ ‘సుబోధ్’ గ్యాంగ్.
* 11 నిమిషాలు.. కోటి రూపాయల దోపిడీ.
* వెయ్యి రూపాయల కోసం హత్యలు చేసే కిరాతకులు.
* కరీంనగర్ జ్యువెలరీ షాప్ దోపిడీలో విస్తుపోయే నిజాలు.

హైదరాబాద్, మహా.

కరీంనగర్ నగర నడిబొడ్డున పట్టపగలు జరిగిన భారీ చోరీ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. కేవలం 11 నిమిషాల్లో కోటీ 5 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను ఊడ్చేసిన ముఠా గుట్టును పోలీసులు దాదాపుగా రట్టు చేశారు. ఈ భారీ దోపిడీకి పాల్పడింది బీహార్‌కు చెందిన కరడుగట్టిన ‘సుబోధ్ గ్యాంగ్’గా దర్యాప్తు బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకూడదని నిందితులు నేలకేసి కొట్టి ధ్వంసం చేసిన ఒక సెల్‌ఫోనే.. ఇప్పుడు వారి పాలిట ఉరితాడుగా మారింది. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పగిలిన ఫోన్ ఇచ్చిన సమాచారంతో మిగిలిన నలుగురు పరారీలో ఉన్న దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
**బంగారమే లక్ష్యంగా అంతరాష్ట్ర ముఠా దొంగతనం**
ఈ నెల 3వ తేదీన నగరంలోని ఓ ప్రముఖ నగల దుకాణంలోకి చొరబడిన దుండగులు రెప్పపాటులో భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ ముఠా కేవలం బంగారాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తుందని, ఇది బీహార్‌కు చెందిన పేరుమోసిన సుబోధ్ గ్యాంగ్ పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏళ్ల తరబడి ఇలాంటి భారీ చోరీలకు పాల్పడటంలో ఈ ముఠా సిద్ధహస్తులని సమాచారం.
**’జులాయి’ సినిమాను తలపించేలా పక్కా స్కెచ్**
ఈ దోపిడీ అచ్చం అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’ సినిమాలోని బ్యాంకు రాబరీ సీన్‌ను తలపించేలా జరిగింది. ముఠాలోని ప్రధాన సూత్రధారి దీనికి పక్కా ప్రణాళిక రచించాడు. దొంగతనంలో పాల్గొన్న వారెవరికీ ఒకరితో ఒకరికి కనీస పరిచయం కూడా లేదు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన పాత నేరస్థులను ప్రధాన నిందితుడు తనకున్న పరిచయాలతో ఒకే చోటకు రప్పించాడు. చోరీకి ముందు రెక్కీ నిర్వహించే సమయంలోనే వీరంతా తొలిసారి కలుసుకున్నారని దర్యాప్తులో తేలింది. కొందరిని రైలు మార్గంలో, మరికొందరిని బస్సు మార్గంలో వ్యూహాత్మకంగా కరీంనగర్ రప్పించారు.
**వెయ్యి రూపాయల కోసం ప్రాణాలు తీసే కిరాతకులు**
ఈ దొంగల ముఠా సభ్యుల నేర చరిత్ర చూసి పోలీసులే విస్తుపోతున్నారు. వీరంతా కేవలం వెయ్యి రూపాయల కోసం అవసరమైతే హత్యలు చేయడానికి కూడా వెనుకాడని కిరాతకులని తెలుస్తోంది. పట్టుబడిన ఇద్దరు నిందితులను విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడించారు. తమకు మిగతా సభ్యులెవరో తెలియదని, కనీసం వారి ఫోన్ నంబర్లు కూడా తమ వద్ద లేవని వారు చెప్పారు. కేవలం ప్రధాన సూత్రధారి నంబర్ మాత్రమే తమ వద్ద ఉందని, దొంగతనంలో పాల్గొంటే కొంత డబ్బు ఇస్తానని బేరం కుదుర్చుకోవడంతోనే తాము ఈ దోపిడీలో భాగమయ్యామని వారు పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం.
**పగిలిన ఫోన్‌తో దొరికిన పక్కా ఆధారాలు**
దోపిడీ అనంతరం ద్విచక్ర వాహనాలపై పరారైన దొంగలు.. పోలీసులకు దొరకకుండా మాస్టర్ ప్లాన్ వేశారు. తప్పించుకునే క్రమంలో బుగ్గారం మండలం మద్దునూరు గ్రామ సమీపంలోకి రాగానే తమ వద్ద ఉన్న కీలకమైన సెల్‌ఫోన్‌ను బలంగా నేలకేసి కొట్టి వెళ్లిపోయారు. అయితే, ఆ పగిలిన ఫోన్ అక్కడే ఆడుకుంటున్న కొంతమంది చిన్నారుల కంటపడింది. వారు దానిని పెద్దలకు చూపించగా, అప్పటికే కరీంనగర్ దోపిడీ వార్త దావానలంలా వ్యాపించి ఉండటంతో గ్రామస్తులు వెంటనే ఆ ఫోన్‌ను ఈ నెల 7వ తేదీన పోలీసులకు అప్పగించారు. పైకి ధ్వంసమైనట్లు కనిపిస్తున్నా ఆ ఫోన్ లోపల పనిచేస్తుండటంతో, సైబర్ నిపుణుల సాయంతో పోలీసులు అందులోని కీలక సమాచారాన్ని బయటకు తీశారు. ఏ ఫోన్ అయితే తమ గుట్టు విప్పకూడదని దొంగలు భావించారో, చివరకు అదే ఫోన్ వారి చిట్టాను పోలీసుల ముందు పరిచింది.
**పరారీలో ఉన్న దొంగల కోసం ముమ్మర గాలింపు**
ఈ భారీ చోరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం.. పూర్తి స్థాయిలో ఈ కేసును ఛేదించే దిశగా దూకుడు పెంచింది. దొరికిన ఫోన్ ఆధారాలతో, పట్టుబడ్డ ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలను ఇతర రాష్ట్రాలకు పంపించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరో నాలుగైదు రోజుల్లోనే పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారితో పాటు మిగిలిన నలుగురు ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేసి తీరుతామని పోలీస్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.