Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం…..

Share

హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం.
* భగీరథ్ విచారణకు డుమ్మా.. ఐటీ కారిడార్‌లో వాల్ పోస్టర్లు.
* బండి భగీరథ్ వ్యవహారంపై భగ్గుమంటున్న మహిళా సంఘాలు.
* అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనలు.
* కేంద్ర మంత్రి కుమారుడు మిస్సింగ్ అంటూ అర్ధరాత్రి రచ్చ.
హైదరాబాద్, మహా.
ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన పోక్సో కేసులో భగీరథ్ పరారీలో ఉన్నాడంటూ హైదరాబాద్ లో వెలసిన వాల్ పోస్టర్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలీసుల విచారణకు ఆయన గైర్హాజరు కావడం, ఎక్కడ ఉన్నాడనే దానిపై కనీస స్పష్టత లేకపోవడంతో ఈ పోస్టర్లు మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ మహిళా సంఘాలు రోడ్డెక్కడం, ఏకంగా మెట్రో రైళ్లలోనూ నిరసనలు వ్యక్తమవుతుండటంతో ఈ వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.

**ఐటీ కారిడార్‌లో పోస్టర్ల కలకలం**
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఉదయం ఈ పోస్టర్లు వెలుగుచూశాయి. ఐటీ కారిడార్‌గా పేరొందిన గచ్చిబౌలి ఫ్లై ఓవర్, నలగండ్ల ఫ్లై ఓవర్‌తో పాటు మున్సిపల్ జోనల్ కార్యాలయ పరిసరాల్లో “బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు” అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించిన పోస్టర్లు దర్శనమిచ్చాయి. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కేంద్ర మంత్రి కుమారుడు తప్పించుకు తిరుగుతున్నాడంటూ అందులో ఘాటుగా రాశారు. రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద అంటించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వాటిని తొలగించే పనిలో పడ్డారు. అయితే ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారు అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
**పోలీసు విచారణకు బండి భగీరథ్ డుమ్మా**
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పోలీసుల విచారణకు హాజరుకాకపోవడం పలు రాజకీయ, న్యాయపరమైన అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని పోలీసులు మంగళవారం రోజే ఆయనకు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన పోలీసుల ముందు హాజరు కాలేదు. ఆయన ఎక్కడ ఉన్నారనే సమాచారం కూడా స్పష్టంగా లేకపోవడంతో, విచారణ నుంచి తప్పించుకునేందుకే అజ్ఞాతంలోకి వెళ్లారా అన్న కోణంలో చర్చ జరుగుతోంది. నోటీసులు ఇచ్చినా రాకపోవడంతో పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
**అసలు కేసు నేపథ్యం ఇదే..**
ఈ మొత్తం వివాదానికి మూలకారణం ఓ మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు. తన 17 ఏళ్ల కుమార్తెను బండి భగీరథ్ తీవ్రంగా వేధిస్తున్నాడంటూ సదరు బాధిత బాలిక తల్లి ఈ నెల 8వ తేదీన (శుక్రవారం రాత్రి) పేట్‌ బషీరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే స్పందించి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద తీవ్రమైన కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి కుమారుడిపై ఏకంగా పోక్సో కేసు నమోదు కావడం అప్పట్లోనే తీవ్ర సంచలనం సృష్టించింది. చట్ట ప్రకారం అత్యంత కఠినమైన ఈ కేసులో నిందితుడిపై ఆరోపణలు రుజువైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు కోసం పోలీసులు నోటీసులు ఇవ్వడం, దానికి ఆయన గైర్హాజరు కావడం గమనార్హం.
**భగ్గుమంటున్న మహిళా సంఘాలు…రాజకీయ దుమారం**
ఈ మొత్తం ఎపిసోడ్‌పై మహిళా సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోక్సో కేసు నమోదైనప్పటికీ నిందితుడిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ పలు మహిళా సంఘాల నాయకులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. చట్టం ముందు అందరూ సమానమేనని, వెంటనే భగీరథ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ నిరసనల సెగ హైదరాబాద్ మెట్రో రైళ్లకు కూడా పాకింది. కొంతమంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తూనే భగీరథ్‌ను అరెస్ట్ చేయాలంటూ పోస్టర్లను ప్రదర్శించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని రాజకీయ వర్గాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి.