**చెరువులు ఆక్రమిస్తే సీజ్ చేయండి.. తప్పు చేస్తే ఉరితీయండి**
రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య, భూ ఆక్రమణల ఆరోపణలపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణలో ఉపాధి లేకపోతే దానికి పవన్ కల్యాణ్ కారణమా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసేవారిని ఉరి తీయాలని, ఒకవేళ ఆ అన్యాయం చేసిన వారిలో పవన్ కల్యాణ్ ఉన్నా సరే ఉరితీయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, హైదరాబాద్‌లో తాను ఏదైనా చెరువు భూమిని ఆక్రమించానని ప్రభుత్వం భావిస్తే, ఆ ప్రాపర్టీని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తాను ఆక్రమించినట్లు తేలితే ఈ రోజే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికే రాసిచ్చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
**గద్దర్ బతికున్నప్పుడు మీరంతా ఏమయ్యారు?**
తెలంగాణ గడ్డతో తనకున్న విడదీయరాని అనుబంధాన్ని పవన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తాను తెలంగాణ నలుమూలలా తిరిగానని, రాష్ట్రం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాడినని చెప్పారు. ఆదిలాబాద్ లాంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించానని, ఇప్పుడు తనను విమర్శిస్తున్న వారు ఏనాడైనా ఆయా ప్రాంతాల్లో తిరిగారా అని ప్రశ్నించారు. ప్రజా యుద్ధ గాయకుడు గద్దర్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్న పవన్.. శరీరంలో బుల్లెట్లు దిగి నడవలేకపోతున్న సమయంలో గద్దర్ తనను ఒక బండి కొనివ్వమని అడిగారని, అడిగిన మూడ్రోజుల్లోనే ఆయనకు బండి కొనిచ్చానని వెల్లడించారు. గద్దర్ బతికి ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న మీరంతా ఏమయ్యారని విమర్శకులను ఆయన నిలదీశారు.








