బీజేపీకి అన్నామలై షాక్..
* ద్రావిడ గడ్డపై సరికొత్త రాజకీయ అస్త్రం.
* ఐదు పేజీల సుదీర్ఘ రాజీనామా లేఖ సమర్పణ.
* ఎన్నికల పరాభవంతో పెరిగిన దూరం.
* అధిష్ఠానంతో తారాస్థాయికి చేరిన విభేదాలు.
• బుజ్జగింపుల పర్వం విఫలం.
చెన్నై, మహా.
తమిళనాడు రాజకీయ ముఖచిత్రంపై అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, గత ఆరేళ్లుగా తమిళనాట భారతీయ జనతా పార్టీకి ‘స్టార్’ ఇమేజ్ తీసుకువచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే.అన్నామలై కమలం గూటికి గుడ్‌బై చెప్పారు. అధిష్ఠానంతో గత కొంతకాలంగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి ఆయన రాజీనామాతో తెరదించారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌లను ప్రత్యేకంగా కలిసిన ఆయన.. ఐదు పేజీల సుదీర్ఘ రాజీనామా లేఖను సమర్పించారు. ఎలాంటి బహిరంగ విమర్శలు, వివాదాలకు తావులేకుండా అత్యంత మర్యాదపూర్వకంగా పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్లు కుండబద్దలు కొట్టారు. అన్నామలై తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.
**ఐదు పేజీల లేఖ.. అసంతృప్తికి పరాకాష్ట**
అధిష్ఠానానికి అందజేసిన ఐదు పేజీల రాజీనామా లేఖలో అన్నామలై తన ఆవేదనను, కేంద్ర నాయకత్వంతో ఉన్న వ్యూహాత్మక విభేదాలను స్పష్టంగా ప్రస్తావించినట్లు అత్యున్నత వర్గాల సమాచారం. ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న తమిళ గడ్డపై బీజేపీ ఇతరుల నీడన కాకుండా, స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలన్నది ఆయన మొదటి నుంచీ చెబుతున్న మాట. అయితే, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలన్న ఢిల్లీ పెద్దల నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తన వాదనను పక్కనపెట్టి కూటమి దిశగా అడుగులు వేయడాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. దీనికి తోడు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన అభిప్రాయాలకు కనీస ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆయనలో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది.
**ఎన్నికల పరాభవంతో పెరిగిన దూరం**
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని ముందుండి నడిపించాల్సిన కీలక నేతకు.. కేవలం ఆరు స్థానాల బాధ్యతలు మాత్రమే అప్పగించడం అన్నామలైను తీవ్రంగా కలచివేసింది. ఈ ఎన్నికల్లో తాను పోటీకి సైతం దూరంగా ఉన్నారు. ఆయన ఊహించినట్లుగానే ఎన్నికల్లో బీజేపీ నిరాశాజనకమైన ఫలితాలను మూటగట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఒక్క స్థానానికే పరిమితమై ఘోర పరాజయం చవిచూడటంతో అన్నామలై వాదన నిజమైంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఆయనను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి నైనార్ నాగేంద్రన్‌కు ఆ పదవిని కట్టబెట్టడం, ఆ తర్వాత తనకు ఎలాంటి సంస్థాగత, రాజకీయ బాధ్యతలు అప్పగించకపోవడంతో పార్టీలో తనకు భవిష్యత్తు లేదని ఆయన ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. పైగా, కేంద్ర విద్యాశాఖ ఇటీవల సవరించిన త్రిభాషా విధానాన్ని సైతం ఆయన బహిరంగంగా వ్యతిరేకించడం ద్వారా అధిష్ఠానంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారనే సంకేతాలను ముందే పంపారు.
**బుజ్జగింపుల పర్వం విఫలం**
అన్నామలై లాంటి కరిష్మా ఉన్న యువ నేతను, ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రంలో వదులుకునేందుకు బీజేపీ అధిష్ఠానం ససేమిరా అంది. ఆయన రాజీనామా లేఖ సమర్పించిన వెంటనే అప్రమత్తమైన జాతీయ నాయకత్వం బుజ్జగింపులకు దిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సైతం ఆయనకు ప్రత్యేక భేటీ ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో కీలకమైన పెద్ద పదవిని అప్పగించడం ద్వారా ఆయనను శాంతింపజేయాలని పార్టీ పెద్దలు వ్యూహరచన చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢిల్లీలోనే ఉండాలని సూచించారు. కానీ, ఏళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తి నేపథ్యంలో.. ఇకపై తన దారి తాను చూసుకుంటానని అధిష్ఠానానికి తేల్చిచెప్పిన ఆయన నేరుగా చెన్నైకి పయనమయ్యారు.
**’తమిళ అస్థిత్వం – జాతీయ దృక్పథం’.. సొంత పార్టీ దిశగా!**
2020లో ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకుని ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన అన్నామలై.. రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. బీజేపీకి గుడ్‌బై చెప్పిన ఆయన తన రాజకీయ ప్రయాణంలో తదుపరి అంకాన్ని అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘తమిళ అస్థిత్వం – జాతీయ దృక్పథం’ అనే సరికొత్త స్లోగన్‌తో, ఒక సెక్యులర్ ప్లాట్‌ఫామ్‌ను ఆయన సిద్ధం చేస్తున్నారు. రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో ఒక కొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించే పక్కా ప్రణాళికతో ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే, నేరుగా రాజకీయ పార్టీగా కాకుండా.. తొలుత ప్రజల పక్షాన ఒక బలమైన ‘ప్రజా ఉద్యమాన్ని’ నిర్మించి, ఆ తర్వాత దానిని రాజకీయ వేదికగా మార్చాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. తన కొత్త రాజకీయ పార్టీపై వస్తున్న ఊహాగానాలకు మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తానని ఆయన ప్రకటించడంతో.. ద్రావిడ రాజకీయాల్లో భవిష్యత్ సమీకరణాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.








