Mahaa Daily Exclusive

  ఏపీలో తెలంగాణ పోలీసుల సోదాలు…

Share

  • ఏపీలో తెలంగాణ పోలీసుల సోదాలు
  • నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే ఇంట్లో విస్తృత తనిఖీలు
  • రూ. 1500 కోట్ల భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ నేత
  • ఫేక్ జీవోలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడ్డారని ఆరోపణ

అమరావతి, మహా : ఫేక్ జీవోలు సృష్టించి హైదరాబాద్‌లో ఏకంగా రూ.1500 కోట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు.. తాజాగా ఏపీలోని ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఇక ఈ బాగోతం బయటికి వచ్చినప్పటి నుంచి బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. గండిపేటలో వందల కోట్ల విలువైన భూములను కాజేసేందుకు.. ఫేక్ జీవోలను సృష్టించిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రస్తుతం పరారీలో ఉండగా అతడిని పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం తాజాగా సైబరాబాద్ పోలీసులు ఏపీకి చేరుకున్నారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. గండిపేట ప్రాంతంలో దాదాపు రూ.1500 కోట్ల భూమికి సంబంధించి నకిలీ జీవోలను తయారు చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ నరసరావుపేటలో బొల్ల బ్రహ్మనాయుడు ఇంట్లో సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. బ్రహ్మనాయుడు, ఆయన టీం కేరళ, కర్ణాటకలో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే 4 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశామని వారి కోసం గాలింపు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

అక్రమంగా జీవోలను సృష్టించి.. రూ.1500 కోట్ల విలువైన భూమిని కాజేసే కుట్రలో బ్రహ్మనాయుడు ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ విలువైన భూమిని కబ్జా చేసిన బ్రహ్మనాయుడు అండ్ టీం వెంటనే దాన్ని ఇతరులకు అమ్మేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ నకిలీ జీవోలను బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో వైరల్ చేశారని పోలీసులు తెలిపారు. అయితే నెట్టింట వైరల్ అవుతున్న నకిలీ జీవోలతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్‌పై నిఘా పెట్టి.. వారిలో కొందర్ని అరెస్ట్ చేశారు.
వైసీపీ నేతలు బ్రహ్మనాయుడు, రాధాకృష్ణ కలిసి మరిన్ని జీవోలు తయారు చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులు ఉండగా.. అందులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురి కోసం గాలింపు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. ఈ ఫేక్ జీవో కేసులో కడప జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాధాకృష్ణపై ఇప్పటికే 9 కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులను కస్టడీకి తీసుకొని విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు.