Mahaa Daily Exclusive

  ఇండియా జన్ బంధన్’ పేరిట విపక్షాల మహాభేటీ…

Share

ఇండియా జన్ బంధన్’ పేరిట విపక్షాల మహాభేటీ.
* నేడు దిల్లీలో సమర శంఖం!
* అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి భేటీ కానున్న ‘ఇండి’ కూటమి.
* 23 రాజకీయ పార్టీల నేతలు హాజరు.
*2029 వ్యూహాలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపైనే ప్రధాన నజర్.
* డీఎంకే బహిష్కరణ.
ఢిల్లీ, మహా.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముగింపు అనంతరం దేశ రాజధాని దిల్లీ వేదికగా ప్రతిపక్ష ‘ఇండి’ కూటమి తొలిసారిగా అత్యంత కీలక సమావేశానికి సిద్ధమైంది. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సోమవారం నాడు జరగబోయే ఈ ప్రత్యేక భేటీకి ఇండియా జన్‌ బంధన్‌ అని నామకరణం చేశారు. దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో భవిష్యత్తు పోరాట కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
*23 పార్టీల కలయిక.. జైరాం రమేశ్ ఎక్స్ పోస్ట్*
ఈ మహాసభకు దేశవ్యాప్తంగా ఉన్న 23 రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఒక సుదీర్ఘ పోస్టును పంచుకున్నారు. వివిధ అనివార్య కారణాల వల్ల కొన్ని భాగస్వామ్య పార్టీలు ఈ సమావేశానికి నేరుగా రాలేకపోతున్నట్లు ముందస్తుగానే సమాచారం అందించాయని ఆయన పేర్కొన్నారు. అయితే, తాము భేటీకి రాకపోయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ‘ఇండి’ కూటమి సాగించే ఉమ్మడి పోరాటానికి తమ పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయా పార్టీలు సంఘీభావ సందేశాలు పంపాయని జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు.
*భవిష్యత్తు లక్ష్యం.. 2029 సార్వత్రిక ఎన్నికలు*
భారతదేశం లాగే వైవిధ్యంతో కూడిన ‘ఇండియా జన్ బంధన్’ కూటమి కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకుంటూ ఐక్యంగా ముందుకు సాగుతుందని జైరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి భవిష్యత్తు కార్యాచరణను అంచెలంచెలుగా రూపొందించుకోవడంపై ఈ సమావేశంలో విపక్షాలు సుదీర్ఘంగా చర్చించనున్నాయి. జాతీయ సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి వ్యూహాలతో ఎలా నిలదీయాలనే అంశంతో పాటు, త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల లోపల, వెలుపల అనుసరించాల్సిన పటిష్టమైన వ్యూహాలపై ఈ భేటీలో ఒక స్పష్టమైన అవగాహనకు రానున్నారు.

*యువత ఆశలకు ద్రోహం’.. మోదీ ప్రభుత్వంపై విమర్శలు*
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలపై ‘ఇండి’ కూటమి భాగస్వామ్య పక్షాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయని జైరాం రమేశ్ తన పోస్టులో ధ్వజమెత్తారు. కోట్లాది మంది భారతీయుల ఓటు హక్కును కాలరాయడంతో పాటు పదేపదే రాజ్యాంగంపై దాడులు చేయడం, కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి అప్రజాస్వామిక పరిణామాలను కూటమిలోని పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని తెలిపారు. నిరంతర ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాల ఆర్థిక వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తూ, లక్షలాది మంది యువత ఆశలు, ఆకాంక్షలకు ద్రోహం చేస్తూ, దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, ప్రస్తుత విదేశాంగ విధానాల వల్ల జాతీయ ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆయన ఆరోపించారు.

*అంతర్గత ఉద్రిక్తతలు.. భేటీకి డీఎంకే దూరం*

కూటమి ఐక్యత గురించి చెప్తున్నప్పటికీ, కొన్ని కీలక భాగస్వామ్య పక్షాల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, ఉద్రిక్తతల తరుణంలోనే ఈ సమావేశం జరుగుతుండటం గమనార్హం. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ తమకు ‘ద్రోహం’ చేసిందనే తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఇదివరకే బహిరంగంగా ప్రకటించి, భేటీకి గైర్హాజరవుతోంది. అటు కేరళలో వామపక్షాలు నేరుగా బీజేపీతో కుమ్మక్కయ్యాయంటూ కాంగ్రెస్ అగ్రనాయకత్వం చేసిన ఆరోపణలపై సీపీఐ(ఎం) తీవ్ర అసంతృప్తితో ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఈ కూటమికి ఇప్పటికే బహిరంగంగానే దూరంగా ఉంటోంది. ఈ పరిణామాల మధ్య జరగనున్న ‘ఇండియా జన్ బంధన్’ సమావేశం విపక్షాల మధ్య సమన్వయాన్ని ఎంతవరకు పటిష్ఠం చేస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.