నిరుద్యోగుల జీవితాలతో సర్కారు చెలగాటం.
*మంత్రులకో లెక్క.. ముఖ్యమంత్రికో లెక్క.
*జీవో 46తో గ్రామీణ యువతకు తీవ్ర అన్యాయం.
* పోలీస్ అభ్యర్థుల పక్షాన బీజేపీ పోరాటం.
* బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కొలువులు సాధించాలనుకునే నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ విధానాలు, లోపాలపై బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ యువతకు ఉద్యోగం పొందడం ఒక హక్కు అని, అయితే ప్రభుత్వాల నిర్లక్ష్యం, తప్పుడు విధానాల కారణంగా వేలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
**జీవో 46తో దారుణ నష్టం**
గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46 నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని, సీడీసీ-1, సీడీసీ-2 పేరుతో తెచ్చిన కొత్త వ్యవస్థ వల్ల గ్రామీణ ప్రాంత యువతకు భారీ నష్టం వాటిల్లిందని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఒకే పరీక్ష రాసిన అభ్యర్థులకు వేర్వేరు కట్ఆఫ్ మార్కులు ఉండటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ వివాదాస్పద జీవో కారణంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ఎక్కువ పోస్టులు వెళ్లాయని, ఫలితంగా గ్రామీణ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు 120 నుంచి 130 మార్కులు వచ్చినా ఉద్యోగాలు రాని దుస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. అధికారంలోకి రాకముందు జీవో 46ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తీరా గద్దెనెక్కాక అభ్యర్థుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
**వయోపరిమితి, దేహదారుఢ్య పరీక్షల్లో లోపాలు**
జీవో 87 ప్రకారం వయోపరిమితి వివాదంపై ఆయన స్పందిస్తూ.. ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల వేలాది మంది యువత వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోయారని గుర్తుచేశారు. ఇతర ఉద్యోగాలకు ఇచ్చిన విధంగానే, పోలీస్ వంటి యూనిఫాం సర్వీసులకు కూడా వయోపరిమితి సడలింపులను పూర్తి స్థాయిలో వర్తింపజేయకపోవడం యువత భవిష్యత్తుతో ఆటలాడటమేనని ఆయన మండిపడ్డారు. దీనికి తోడు, దేశవ్యాప్తంగా ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్లో సైతం లాంగ్ జంప్ క్వాలిఫైయింగ్ దూరం 3.8 మీటర్లుగా ఉంటే, తెలంగాణలో మాత్రం దాన్ని 4 మీటర్లకు పెంచడం పట్ల మహేశ్వర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో మాత్రమే ఇలాంటి కఠిన నిబంధన ఎందుకు పెట్టారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
**అక్రమ కేసులు ఎత్తివేయాలి.. 20 వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి**
తమకు న్యాయం చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని శాంతియుతంగా కోరిన 9 మంది విద్యార్థులపై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఆ విద్యార్థులపై మోపిన కేసులను ప్రభుత్వం బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నారాయణపేట, గద్వాల, ఆదిలాబాద్, నిర్మల్ వంటి వెనుకబడిన జిల్లాలకు చెందిన యువత కష్టపడి చదివినా అవకాశాలు దక్కకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అవసరాలకు ప్రస్తుతమున్న కేవలం 5,000 కానిస్టేబుల్ పోస్టులు ఏమాత్రం సరిపోవని, నిరుద్యోగ యువత డిమాండ్ మేరకు కచ్చితంగా 20 వేల పోలీస్ పోస్టులతో నూతన నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన స్పష్టం చేశారు.
**ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి కనీస స్పష్టత కరువు**
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వానికి కనీస స్పష్టత లేదని, మంత్రివర్గంలో ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య చెబుతూ నిరుద్యోగులను తప్పుదోవ పట్టించడంలో ఈ ప్రభుత్వం పరాకాష్టకు చేరిందని ఆయన విమర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు 70 వేల ఉద్యోగాలని చెబుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకంగా లక్ష ఉద్యోగాలని అంటున్నారని, ఇలా గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో 46 వల్ల జరిగిన అన్యాయంపై స్పష్టతనివ్వాలని, వయోపరిమితి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఇందులో భాగంగానే తాము దిల్షుక్నగర్కు వెళ్లి, అక్కడ ఉన్న విద్యార్థులను స్వయంగా కలిసి వారి సమస్యలను వింటామని ఆయన ప్రకటించారు. నిరుద్యోగ యువతకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు బీజేపీ విశ్రమించదని, యువత పక్షాన నిలబడి పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. యువత అడుగుతున్నది రాజ్యాంగం కల్పించిన ఉద్యోగమనే హక్కును మాత్రమేనని, ప్రభుత్వాల ఉపకారాన్ని కాదని ఆయన స్పష్టం చేశారు.







