Mahaa Daily Exclusive

  రేవంత్ రెడ్డి పక్కా మోసగాడు!

Share

రేవంత్ రెడ్డి పక్కా మోసగాడు!
*ఔరంగజేబులా ప్రజల పై పన్నుల భారం.
* పేదలకు పైసల్లేవు కానీ ప్యాలెస్‌లకు వందల కోట్లా?
* ఉమ్మడి పాలమూరులో 14కు 14 సీట్లు గెలుస్తాం.
* కొడంగల్‌లో రేవంత్‌ను చిత్తుగా ఓడిస్తాం!
* అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం.

అచ్చంపేట, మహా.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొనగాడు కాదని, ఆయన పక్కా మోసగాడని మాజీ మంత్రి, శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నల్లమల పేరు చెప్పి ఆ ప్రాంత గౌరవాన్ని ముఖ్యమంత్రి తగ్గిస్తున్నారని మండిపడ్డారు. అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సభలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రైతులకు ఇవ్వాల్సిన రూ. 29,350 కోట్ల రైతు భరోసాను ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి, వడ్ల బోనస్‌ను సైతం బోగస్ చేశారని విమర్శించారు. దళారులు, మిల్లర్ల చేతిలో ముఖ్యమంత్రి తోలుబొమ్మలా మారారని, ఎవరి తోలు తీయలేదని ఎద్దేవా చేశారు. కనీసం మొలకెత్తిన ధాన్యాన్ని కొనలేని దద్దమ్మ ప్రభుత్వం.. బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనివ్వనని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం చెబితేనే జొన్నలు, మక్కలు, సోయాబీన్, పల్లి, సన్‌ఫ్లవర్ కొంటామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌లో వడ్లు కొనే పరిస్థితిలో లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో పేదలకు ఇవ్వడానికి పైసల్లేవంటున్న రేవంత్ రెడ్డికి, జూబ్లీహిల్స్‌లో రూ. 100 కోట్లతో గెస్ట్ హౌస్, దాని చుట్టూ రూ. 17 కోట్లతో ఇనుప కంచె నిర్మించుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని హరీశ్ రావు ప్రశ్నించారు. కేరళ, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి పక్క రాష్ట్రాల్లో పత్రికా ప్రకటనల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని, మనవడితో ఫుట్‌బాల్ ఆడుకునేందుకు మాత్రం డబ్బులు ఉంటున్నాయా అని నిలదీశారు. నాడు ఔరంగజేబు జుట్టుపై పన్ను వేసినట్లు, నేడు పెట్రోల్, డీజిల్, ఎరువులు, ఆర్టీఏ ఛార్జీలు, మద్యం ధరల పేరుతో రేవంత్ సర్కార్ ప్రజల రక్తం తాగుతూ పన్నుల భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఒక తరం విద్యార్థులు తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి దాపురించిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల పేరు చెబుతున్నారే తప్ప, ఏ ఒక్క వర్గానికీ కాంగ్రెస్ పాలనలో మేలు జరగలేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఒక్క ప్రాజెక్టును కూడా నిర్మించలేదని, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్లుగా పాలన సాగుతోందని హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 75 శాతం పూర్తి చేశామని గుర్తు చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసి 3 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన పనులను గాలికి వదిలేసిందని, ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్‌ను మూరెడు కూడా తవ్వలేదని మండిపడ్డారు. కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ప్రాజెక్టుల పరిస్థితి తయారైందని ఆరోపించారు. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో 54 మంది చనిపోతే కనీసం ఒక్క రూపాయి ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు.
భూమి బద్దలైనా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం రాజీనామాతో చరిత్ర సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా రాదంటున్న రేవంత్ రెడ్డి, పరోక్షంగా బీఆర్ఎస్ తిరిగి అధికార పక్షం (పాలక పక్షం) అవుతుందని ఒప్పుకుంటున్నారని చమత్కరించారు. రాబోయే ఎన్నికల్లో 100 స్థానాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14కు 14 సీట్లు గెలుచుకుని, గతంలో ఇంచార్జ్‌గా ఉండి కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడించినట్లే ఈసారి కూడా చిత్తుగా ఓడిస్తామని సవాల్ విసిరారు. అచ్చంపేట గడ్డపై గులాబీ జెండా ఎగరేసేలా కార్యకర్తలు గట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన అధికారులు ఎవరైనా సరే.. వారు రిటైర్ అయినా ఎక్కడున్నా సరే బొక్కలో వేస్తామని హరీశ్ రావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి మోసాలను నిరంతరం ఎండగడుతూనే ఉండాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్ల రేవంత్ పాలనను ఏభై ఏళ్ల పాటు తిట్టుకునే పరిస్థితి వస్తుందని, స్కామ్‌ల ప్రభుత్వం పోయి స్కీమ్‌ల ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.