హైదరాబాద్, మహా.
పూజల పేరుతో అమాయకులను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేయడమే కాకుండా, చేతబడి చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ ఎన్నారై పూజారి ఆట ఎట్టకేలకు కట్టయింది. బాచుపల్లి పోలీసుల లుక్ అవుట్ నోటీసుల (ఎల్వోసీ) ఆధారంగా నిందితుడు చామర్తి రామ లచ్చారావును శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటనలో, బాధితుడి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అప్పటికే నిందితుడు రామ లచ్చారావు అమెరికాకు పరారవ్వడంతో పోలీసులు అతనిపై ఎల్వోసీ జారీ చేశారు. కాగా, అమెరికాకు వెళ్లిన తర్వాత కూడా ఈ పూజారి తన మోసాలను ఆపలేదు. అక్కడ కూడా చీటింగ్‌కు పాల్పడటంతో ఓ గుడి యజమాని ఇతనిపై కేసులు నమోదు చేశారు. దీంతో భయపడిన నిందితుడు గుట్టుచప్పుడు కాకుండా తిరిగి ఇండియాకు పారిపోయి వచ్చే ప్రయత్నం చేశాడు.
ఇండియాకు తిరిగి వస్తున్న క్రమంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే, ముందస్తు సమాచారం ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడి చేతిలో మోసపోయిన బాధితుల జాబితా భారీగానే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. పూజలు, దోష నివారణల పేరుతో వల పన్నే కేటుగాళ్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నకిలీ బాబాలు, పూజారుల మాటలు నమ్మి వారికి డబ్బులు ఇవ్వడం, ఇతరత్రా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపడం చేయవద్దని పోలీసులు ప్రజలకు హితవు పలికారు.








