- నాకు ఏమైనా జరిగితే సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత.
- ప్రభుత్వానివి ముమ్మాటికీ కక్షసాధింపు చర్యలే.
- భద్రత తీసేసినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.
హైదరాబాద్, మహా.
బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన భద్రతను (సెక్యూరిటీ) తొలగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ భవిష్యత్తులో తనకు ప్రాణాపాయం గానీ, మరేదైనా హాని గానీ జరిగితే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తనపై ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రవీణ్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అధికార పార్టీ తనను లక్ష్యంగా చేసుకుందని ఆయన దుయ్యబట్టారు. విపక్ష నేతగా ప్రజాపక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే తనను ఇలాంటి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఒక మాజీ ఉన్నతాధికారిగా, ప్రజానేతగా నిరంతరం ప్రజల్లో ఉండే తనకు కనీస రక్షణ లేకుండా చేయడం వెనుక ప్రభుత్వ అసలు ఉద్దేశం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు.
తాను చేసే ప్రతి పోరాటం కేవలం ప్రజల కోసమేనని, అందులో తనకెలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. తన భద్రతను తొలగించినంత మాత్రాన తాను భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోబోనని, ప్రజల తరఫున ఇకముందు మరింత బలంగా గొంతెత్తుతానని ఆయన ప్రభుత్వానికి స్పష్టం చేశారు.








