- నిందితుడు సుల్తానీ బకతాష్‌పై కోర్టులో ప్రాసిక్యూషన్ ఆరోపణలు.
- సైతాన్ ఆవహించిందంటూ న్యాయస్థానంలో బుకాయించే యత్నం.
బోల్టన్ (బ్రిటన్):మహా.
బ్రిటన్‌లోని బోల్టన్ క్రౌన్ కోర్టులో జరుగుతున్న ఒక అత్యాచారం కేసు విచారణలో నిందితుడు చెప్పిన సమాధానం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇద్దరు 14 ఏళ్ల బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఆఫ్ఘన్ శరణార్థి.. కోర్టులో విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చాడు. తాను మద్యం తాగిన తర్వాత తనపై ‘సైతాన్’ ఆవహించిందని, అందుకే ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తులేదని బుకాయించే ప్రయత్నం చేశాడు.
ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన సుల్తానీ బకతాష్ (29) గత డిసెంబర్లో బోల్టన్‌లోని తన ఫ్లాట్‌కు ఇద్దరు బాలికలను తీసుకొచ్చాడు. వారికి ఉద్దేశపూర్వకంగా వోడ్కా తాగించాడు. అనంతరం వారు పూర్తిగా మత్తులోకి జారుకుని స్పృహ తప్పే స్థితికి చేరుకున్నప్పుడు వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘోరానికి సంబంధించి అతడిపై రెండు రేప్ కేసులు, పలు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులో తాను నిర్దోషినని బకతాష్ కోర్టులో వాదిస్తున్నాడు.
కోర్టు విచారణలో భాగంగా అనువాదకుడి సాయంతో బకతాష్ తన సాక్ష్యాన్ని రికార్డు చేశాడు. ఆ రాత్రి మద్యం తాగిన తర్వాత తనకు విపరీతంగా తల తిరిగిందని, వాంతులు అయ్యాయని, ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదని చెప్పాడు. అంతేకాకుండా ఆ బాలికల వయసు 18 లేదా 19 ఏళ్లు ఉంటుందని తాను భావించినట్లు కోర్టును తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. ముస్లిం మతాచారాల ప్రకారం తాను సాధారణంగా మద్యం ముట్టనని చెబుతూ.. “ఆ రాత్రి నాపై సైతాన్ ఆవహించిందని అనుకుంటున్నాను. అందుకే ఆ బాటిల్ లోని మద్యం తాగాను, అది చాలా చేదుగా ఉంది” అని జ్యూరీ ముందు వింత వాదనలు వినిపించాడు.
కాగా, 2022లో అఫ్ఘనిస్థాన్‌లోని బ్రిటన్ సైన్యానికి సహాయకుడిగా పనిచేసిన బకతాష్.. తాలిబన్ల భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యూకేకు శరణార్థిగా వచ్చాడు. ప్రస్తుతం బోల్టన్‌లో ఉంటూ ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాడు. నిందితుడు కావాలనే బాలికల బలహీనతను ఆసరాగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడని, కఠిన శిక్ష నుంచి తప్పించుకోవడానికే ‘సైతాన్’ పై నెపం వేస్తూ కట్టుకథలు అల్లుతున్నాడని ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.








