- ఉపాధి చట్టంపై సుప్రీంకోర్టుకైనా వెళ్తాం.
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
- కేరళ, కర్ణాటకలతో కలిసి ఉమ్మడి పోరుకు సిద్ధం.
- 60 కాదు.. కనీసం 200 రోజుల ఉపాధి కల్పించాలి.
- జూలై 2న రాష్ట్ర కేబినెట్‌లో తుది నిర్ణయం.
హైదరాబాద్, మహా.
గ్రామీణ పేదల జీవనోపాధికి వెన్నెముకగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం ప్రతిపాదించిన ‘వీబీ-జీ రామ్-జీ చట్టం-2025’ను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టం ముసుగులో రాష్ట్రాల అధికారాలను లాక్కునే కుట్రను కేంద్రం అమలు చేయాలని చూస్తోందని, దీనిపై కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకునేందుకు అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు తడతామని తేల్చిచెప్పారు.
శనివారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉపాధి హామీ చట్టం సవరణలపై రెండో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి సీతక్కతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు దానకిశోర్, డి.దివ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఉపాధి చట్టం సవరణ కాదని, భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధిపై రాష్ట్రాల పాత్రను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదల భవిష్యత్తును తాకట్టుపెట్టే ఏ చట్టాన్నీ రాష్ట్ర ప్రభుత్వం తలవంచి అమలు చేయబోదని స్పష్టం చేశారు. ఈ చట్టంలో అనేక రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు ఉపసంఘం దృష్టికి తీసుకొచ్చారని, సమాఖ్య వ్యవస్థను విశ్వసించే ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి న్యాయపరమైన, రాజకీయ కార్యాచరణను రూపొందిస్తామని వెల్లడించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పలు పౌర సంఘాలు సైతం కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. కేంద్రం ప్రతిపాదించిన 60 రోజుల ఉపాధి పరిమితిని వ్యతిరేకిస్తూ, గ్రామీణ కుటుంబాలకు కనీసం 200 రోజుల ఉపాధి కల్పించి, చట్టబద్ధమైన కనీస వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరాయి. అవసరమైతే రాష్ట్రమే సొంతంగా ఉపాధి చట్టాన్ని తీసుకురావాలని సూచించాయి. కేంద్రం ప్రతిపాదించిన 60:40 నిధుల భాగస్వామ్య విధానం వల్ల తెలంగాణపై వేల కోట్ల అదనపు భారం పడుతుందని, ఈ అంశాన్ని న్యాయశాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తోందని మంత్రి వివరించారు. పనితీరు బాగున్న రాష్ట్రాలను శిక్షిస్తూ, వెనుకబడిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా కేంద్రం నిధుల కేటాయింపు విధానం తీసుకురావడం అన్యాయమని మంత్రి ఆక్షేపించారు. రాష్ట్రం ఇప్పటికే చేసిన సమగ్ర సూచనలను కేంద్రం కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
తెలంగాణ ప్రజల హక్కులు, రాజ్యాంగబద్ధ అధికారాలు, గ్రామీణ పేదల జీవనోపాధిని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని, కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని ఉత్తమ్ తేల్చిచెప్పారు. కేంద్ర ప్రతిపాదనలపై అనుసరించాల్సిన వ్యూహం, సొంత చట్టం రూపకల్పన, సుప్రీంకోర్టును ఆశ్రయించడం వంటి అన్ని ప్రత్యామ్నాయ మార్గాలపై జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.







