Mahaa Daily Exclusive

  హర్మూజ్ జలసంధి సమీపంలో విషాదం –  సౌదీ అరామ్‌కో హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది మృతి.

Share

ఢిల్లీ, మహా.

ప్రపంచ చమురు రవాణాలో కీలక కేంద్రమైన హర్మూజ్ జలసంధి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సౌదీ అరామ్‌కో సంస్థకు చెందిన హెలికాప్టర్ పర్షియన్ గల్ఫ్ పశ్చిమ తీరాన ఉన్న ‘రాస్ తనూరా’ వద్ద కుప్పకూలడంతో 14 మంది సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో తీవ్ర కలకలం రేపింది.

సౌదీ ప్రభుత్వ మీడియా సంస్థ ‘సౌదీ ప్రెస్ ఏజెన్సీ’ అందించిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదం ఆదివారం ఉదయం సుమారు 6:00 గంటలకు సంభవించింది. హెలికాప్టర్ రాస్ తనూరా ప్రాంతంలో కూలిపోగా, అందులో ప్రయాణిస్తున్న 14 మంది సిబ్బంది ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ సౌదీ అరేబియా జాతీయులేనని ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి టెర్మినల్‌గా పేరుగాంచిన రాస్ తనూరా కార్యకలాపాలు గత నాలుగు నెలలుగా అమెరికా-ఇరాన్ వివాదాల నేపథ్యంలో నిలిచిపోయాయి. అయితే, అన్ని అడ్డంకులను అధిగమించి, సౌదీ అరామ్‌కో సంస్థ శుక్రవారం నుంచే మళ్లీ ముడి చమురు లోడింగ్ ప్రక్రియను పునఃప్రారంభించింది. చమురు రవాణా తిరిగి ఊపందుకున్న రెండు రోజులకే ఈ దారుణ ప్రమాదం జరగడం గమనార్హం.
ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతం తెలియరాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారుల పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరుగుతోందని ప్రకటించింది. ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.

ఈ హెలికాప్టర్ ప్రమాదం చమురు సంస్థ సిబ్బందిలోనూ, స్థానికుల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక వెలువడిన తర్వాతే ప్రమాదంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Latest