పుణె,మహా.
పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ సంచలన ఘటన జరిగి పది రోజులు గడుస్తున్న నేపథ్యంలో, కేసును అన్ని కోణాల్లో ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరీలను హత్య జరిగిన లోహగడ్ కోట వద్దకు తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు.
కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారిన ఈ ప్రక్రియపై పుణె రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. హత్య జరిగిన ప్రదేశంలో నిందితుల సమక్షంలోనే ఘటన ఎలా జరిగిందో పూర్తి వివరాలను వారు పోలీసులకు వివరించారు. ఈ క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ ద్వారా ఘటన జరిగిన రోజున నిందితులు కోట వద్దకు ఎలా చేరుకున్నారు, ఏయే సమయాల్లో వారు ఎక్కడ ఉన్నారు, అసలు హత్యకు ముందు మరియు ఆ సమయంలో వారి కదలికలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలను దర్యాప్తు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
సంఘటన జరిగిన రోజున వరుస క్రమంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని పోలీసులు పునఃసృష్టించారు. ఈ మొత్తం ప్రక్రియను పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. కోర్టు విచారణలో ఈ వీడియోలు కీలక సాక్ష్యాలుగా ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ తర్వాత పోలీసులు నిందితురాలు సియాను అక్కడి నుంచి తరలిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితులు నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో, పూర్తిస్థాయిలో ఆధారాలను సేకరించి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు దర్యాప్తు ముగిసిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.







