Mahaa Daily Exclusive

  ధరణి అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు! ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..!

Share

హైదరాబాద్, మహా.

 

ధరణి, భూ భారతి పోర్టళ్ల భద్రత, భూ రికార్డుల సమగ్రతపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్‌లో జరిగినట్లు గుర్తించిన సాంకేతిక లోపాలు, అనధికార నమోదులపై ఫోరెన్సిక్ ఆడిట్ కొనసాగుతున్న నేపథ్యంలో, ఇదే తరహా ముప్పు భూ భారతి పోర్టల్‌కూ ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు సూచించేందుకు సీనియర్ అధికారులతో ప్రత్యేక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.

 

ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెలుగుచూసిన అంశాలు

 

రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం, ప్రస్తుతం ధరణి పోర్టల్‌పై కొనసాగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్‌లో పలు భద్రతాపరమైన లోపాలు గుర్తించినట్లు వెల్లడించారు. ఆ లోపాలను ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యక్తులు పోర్టల్ ద్వారా అనధికారికంగా భూ నమోదులు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఈ అంశాలపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

 

భూ భారతి పోర్టల్‌పైనా అప్రమత్తత

 

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన భూ భారతి పోర్టల్ కూడా ధరణి తరహా సాంకేతిక నిర్మాణంపైనే ఆధారపడిందని ప్రభుత్వం వెల్లడించింది. అందువల్ల ధరణిలో గుర్తించిన భద్రతా లోపాల మాదిరిగానే భూ భారతి పోర్టల్‌కూ సాంకేతిక ముప్పు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గతంలో ధరణి పోర్టల్‌లో జరిగిన అవకతవకలకు పాల్పడిన వ్యక్తులే మళ్లీ దుర్వినియోగానికి పాల్పడి ఉండొచ్చన్న అనుమానాన్ని కూడా ప్రభుత్వం వ్యక్తం చేసింది.

 

ఉన్నతస్థాయి కమిటీకి కీలక బాధ్యతలు

 

ఈ వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో విచారించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సైబర్ భద్రత నిపుణులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్రతినిధులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అవకతవకలకు బాధ్యులను గుర్తించడం, వారిపై తీసుకోవాల్సిన కఠిన చర్యలను ప్రభుత్వానికి సూచించడం, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సాంకేతిక భద్రతా చర్యలను ప్రతిపాదించడం కమిటీ ప్రధాన బాధ్యతలుగా నిర్ణయించారు.

 

15 రోజుల్లో నివేదిక

 

ప్రత్యేక కమిటీ తన సమగ్ర నివేదికను పదిహేను రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థలో అవసరమైన సాంకేతిక, పరిపాలనా మార్పులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

 

కొత్త భద్రతా ప్రమాణాలతో పోర్టల్

 

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాల మేరకు అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కూడిన మరింత పటిష్ఠమైన భూ రికార్డుల పోర్టల్‌ను రూపొందించాలని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌ను ప్రభుత్వం కోరింది. భవిష్యత్తులో ఎలాంటి సైబర్ ముప్పులు, అనధికార జోక్యాలకు అవకాశం లేకుండా ఆధునిక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించినట్లు వెల్లడించింది.

 

భూ రికార్డుల భద్రతపై రాజీ లేదు

 

రాష్ట్ర ప్రజల భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. భూ రికార్డుల భద్రత విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని, సాంకేతికంగా అత్యంత విశ్వసనీయమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు అవకతవకలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.

Latest