Mahaa Daily Exclusive

  అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్..

Share

  • కృష్ణమోహన్ ఫిర్యాదుతోనే కేసు నమోదు
  • చంపత్ రాయ్ రాజీనామా నేపథ్యంలో కృష్ణమోహన్ ఎంపిక

అయోధ్య, మహా : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (అయోధ్య ట్రస్ట్)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విరాళాల దుర్వినియోగం కేసు నేపథ్యంలో, ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్యలో దాదాపు 3 గంటలపాటు అత్యవసర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చంపత్ రాయ్ రాజీనామాను అధికారికంగా ఆమోదించింది. చంపత్ రాయ్‌తో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా (వినోద్ మిశ్రా) కూడా తమ పదవుల నుంచి వైదొలిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ట్రస్ట్ సభ్యులుగా ఉన్న రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి కృష్ణమోహన్ కు జనరల్ సెక్రటరీగా తాత్కాలిక బాధ్యతలను చేప‌ట్టారు. కృష్ణమోహన్ ఫిర్యాదుతోనే కేసు నమోదవ్వ‌గా రామమందిరానికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల లెక్కింపు ప్రక్రియలో దాదాపు రూ. 7 కోట్ల నుండి రూ. 7.5 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.

 

దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపు విభాగంలో పనిచేసే ఎనిమిది మంది నిందితులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో చంపత్ రాయ్ వ్యక్తిగత డ్రైవర్ కూడా ఉండటంతో వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలోనే చంపత్ రాయ్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా సమర్పించారు.

 

కీలక నిర్ణయాల దిశగా ట్రస్ట్ అడుగులు

 

సోమవారం అయోధ్య రామమందిర ప్రాంగణంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశానికి కీలక ట్రస్టీలు హాజరయ్యారు. విరాళాల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసేందుకు ట్రస్ట్‌లో భారీ అంతర్గత మార్పులు చేయాలని నిర్ణయించారు. తాత్కాలిక బాధ్యతలు స్వీకరించిన కృష్ణమోహన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఆలయ పరిపాలన పరంగా మరికొన్ని కీలక సంస్కరణలు వచ్చే అవకాశం ఉంది.

Latest