Mahaa Daily Exclusive

  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ..!

Share

  • డీఎస్పీ భీమ్‌రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ
  • రూ. 300 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు

హైదరాబాద్, మహా : తెలంగాణ పోలీస్ శాఖలో అవినీతి తిమింగలాల వేటను అవినీతి నిరోధక శాఖ మరింత ముమ్మరం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అధికారికంగా అరెస్ట్ చేశారు. సోదాల సమయంలో ఆస్తుల చిట్టా బయటపడటంతో భీమ్‌రెడ్డి బీపీ ఒక్కసారిగా పెరగడంతో ఆయనను తొలుత ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నివేదిక, ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం, ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో ఆయనను ఏసీబీ అధఇకారులు అధికారికంగా అదుపులోకి తీసుకున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, భీమ్‌రెడ్డిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచారు. కానిస్టేబుల్‌గా కెరీర్ ప్రారంభించి డీఎస్పీ స్థాయికి ఎదిగిన భీమ్‌రెడ్డి, ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు వెనకేయడం పోలీస్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

 

నాలుగు రోజుల క్రితం సుదీర్ఘ సోదాలు

 

నాలుగు రోజుల క్రితం (గురువారం) తెల్లవారుజాము నుంచే డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని నార్సింగి, ఇబ్రహీంబాగ్‌లోని లగ్జరీ విల్లా, గచ్చిబౌలి, టెలికాం నగర్, మణికొండలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సోదాలలో భీమ్‌రెడ్డి సంపాదించిన విస్తుపోయే అక్రమాస్తులు బయటప‌డ్డాయి. లగ్జరీ విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో వాటాలు, ఐటీ కారిడార్‌లో ఖరీదైన ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లతో పాటు కర్ణాటకలోని దేవనహళ్లి, ఇతర ప్రాంతాలలో దాదాపు 45 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి అదనంగా, డీఎస్పీ ఇంటి నుంచి, బినామీ ఇళ్ల నుంచి రూ. 43.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2 కేజీల బంగారు ఆభరణాలు, 20 కేజీల వెండి వస్తువులను అదుపులోకి తీసుకున్నారు. సోదాల సమయంలో లభించిన 23 విదేశీ మద్యం సీసాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కేసు నమోదు చేసింది.

Latest