Mahaa Daily Exclusive

  హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం….

Share

  • హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం
  • పోలీసులకు చిక్కిన ఎమ్మెల్సీ కుమారుడు
  • మరో ముగ్గురి అరెస్టు, పరారీలో ఉన్న నలుగురి కోసం గాలింపు

హైదరాబాద్, మహా : హైదరాబాద్‌లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న ముగ్గురు కస్టమర్లను పోలీసులు ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నేత కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పురానాపూల్ పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాలను కొనుగోలు చేయడానికి మొత్తం ఏడుగురు వ్యక్తులు రాగా, పోలీసుల రాకను గమనించి వారిలో నలుగురు అక్కడికక్కడే పరారయ్యారు. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో మాజీ కలెక్టర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డి కుమారుడు భరత్ రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ అనే ముగ్గురు నిందితులు పట్టుబడగా, వారి నుంచి 24 గ్రాముల హాష్ ఆయిల్ సాచెట్లు, 22 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో సోనీ, వంశీ, మనోజ్, తుల్జాసింగ్ అనే మరో నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుబడిన భరత్‌రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ లను వైద్య పరీక్షల అనంతరం పోలీసులు తదుపరి చర్యల కోసం రిహాబిటేషన్ సెంటర్ కు తరలించారు. ఈ ఘటనపై మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

బ్లడ్ శాంపిల్స్ సేకరణ.. ఉస్మానియాకు తరలింపు

పోలీసులు నిందితులందరినీ అక్కడికక్కడే అదుపులోకి తీసుకుని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులు మాదకద్రవ్యాలు సేవించారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు. స్టేషన్‌లోనే వారి నుంచి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించారు. ఆ తర్వాత మరింత లోతైన వైద్య పరీక్షల నిమిత్తం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితులను ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ కేసు అత్యంత సున్నితమైనది కావడం, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రావడం వల్ల పోలీసులు ప్రస్తుతం చాలా గోప్యతను పాటిస్తున్నారు. పట్టుబడిన ఎమ్మెల్సీ కుమారుడు భరత్ మినహా, మిగిలిన ముగ్గురు నిందితుల పూర్తి వివరాలను వారి నుంచి ఎంత పరిమాణంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారనే విషయాలను అధికారికంగా వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.