- బీజేపీ అధికారంలోకి వస్తే
- హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తాం
- కేంద్ర మంత్రి బండి సంజయ్
- సైదాబాద్ సక్సెస్ స్కూల్ పై బండి సీరియస్
హైదరాబాద్, మహా : సైదాబాద్‌లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్లో హిందూ విద్యార్థులకు కల్మా, సురా ఫతేహా చదవాలంటూ హోంవర్క్ ఇచ్చారన్న వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బరితెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని కల్మా, సూరహ్ ఫతే చదవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సక్సెస్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ ఘటనపై సెక్యూలర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని తాము అధికారంలోకి రాగానే హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామన్నారు. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో
ఆటో డ్రైవర్ కు భరోసా
ఇటీవల ఆటో డ్రైవర్ భరత్ ను పోలీసులు, మజ్లిస్ నాయకులు వేధింపులకు గురి చేశారని భరత్‌ను వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. హిందూ సంఘాల నేతలతో కలిసి హైదరాబాద్ లో బండి సంజయ్ ను బాధిత ఆటో డ్రైవర్ కలిశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ భరత్ కు భరోసానిచ్చిన సంజయ్ కొత్త ఆటో కొనిస్తానని మాట ఇచ్చారు. ఇలాంటి ఘటనలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తే తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. భరత్ రాసిన దాంట్లో తప్పేముంది? హిందువులను కించపర్చేలా ఉర్దూలో ఆటోలపై, గోడలపై రాసుకున్న వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. మజ్లిస్ వాళ్లకో న్యాయం? భరత్ కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్ పై దాడికి దిగిన మజ్లిస్ కార్యకర్తలపై, వేధింపులకు గురి చేసిన పోలీసులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.








