డాక్టర్ పులిపాటి ప్రసాద్‌కు ‘ఎక్సెలెన్స్ ఇన్ సోషల్ సర్వీస్’ అవార్డు.
• ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పురస్కారం ప్రదానం.
హైద్రాబాద్, మహా.
సామాజిక సేవా రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా ఖమ్మానికి చెందిన విద్యావేత్త, పులిపాటి విద్యాసంస్థల అధినేత డాక్టర్ పులిపాటి ప్రసాద్‌కు ‘ఎక్సెలెన్స్ ఇన్ సోషల్ సర్వీస్’ అవార్డు ప్రదానం చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం (ఉండవల్లి)లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. శిల్ప కళా ఆర్ట్స్ ఇంటర్నేషనల్ అకాడమీ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎంపికైన తొమ్మిది మంది ప్రముఖుల్లో డాక్టర్ పులిపాటి ప్రసాద్ కూడా ఒకరుగా నిలిచారు.
కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు అందించిన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు, వివిధ సేవా రంగాలకు చెందిన వారికి నిత్యావసర వస్తువులు, ఆహార సామగ్రి, అవసరమైన సహాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు. అలాగే వైద్య, పారామెడికల్ విద్యను అభ్యసిస్తున్న సుమారు మూడు వేల మంది విద్యార్థులను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి కరోనా బాధితులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినట్లు వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్‌ను అభినందించి, భవిష్యత్తులో కూడా విద్యా, సామాజిక సేవా రంగాల్లో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పురస్కారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు డాక్టర్ పులిపాటి ప్రసాద్ పేర్కొన్నారు.
డాక్టర్ పులిపాటి ప్రసాద్‌కు గతంలో కూడా వివిధ రంగాల్లో చేసిన సేవలకు అనేక పురస్కారాలు లభించాయి. సామాజిక సేవలకు గుర్తింపుగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ‘జీ తెలుగు అచీవర్స్ అవార్డు’ అందుకున్నారు. విద్యా రంగంలో సేవలకు గాను ‘ఉత్తమ ఎడ్యుకేషనలిస్ట్’ అవార్డు, ‘ఉత్తమ విద్యా సంస్థల అవార్డు’, జాతీయ స్థాయిలో ‘వాగ్దేవి విద్యా సంస్థల పురస్కారం’తో పాటు ‘మహాత్మా గాంధీ నేషనల్ అవార్డు’ వంటి పలు పురస్కారాలు ఆయనకు దక్కాయి.
విద్యా సేవలతో పాటు పర్యావరణ పరిరక్షణ, వినియోగదారుల హక్కులపై అవగాహన, సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా డాక్టర్ పులిపాటి ప్రసాద్ చురుకుగా పనిచేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కరోనా సమయంలో విద్యార్థులకు ఫీజు రాయితీలు కల్పించడం, అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సామాజిక సేవ, విద్యా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా ఈ తాజా పురస్కారం ఆయనకు లభించడం విశేషంగా నిలిచింది.








