Mahaa Daily Exclusive

  కాకినాడ ఘటనలపై పవన్ కల్యాణ్ ఆందోళన…

Share

కాకినాడ ఘటనలపై పవన్ కల్యాణ్ ఆందోళన.
• సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం.
కాకినాడ, మహా.
కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలం మూలపేటలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు హత్య ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం మత్తు, క్షణికావేశం, చిన్నచిన్న వివాదాలు ప్రాణనష్టాలకు దారితీస్తుండటం అత్యంత విచారకరమని పేర్కొంటూ, ఈ ఘటనలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో చోటుచేసుకున్న ఘటనలో పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన రాకేశ్‌ (25) మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. తన అమ్మమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మూలపేటకు వచ్చిన రాకేశ్, తన సోదరిని కొందరు యువకులు వేధిస్తున్నారని తెలుసుకుని వారిని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో వంశీ అనే యువకుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రాకేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

మరోవైపు గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని దారపల్లి జలపాతం వద్ద జరిగిన మరో ఘటనలో మాజీ కౌన్సిలర్ సంధ్య భర్త లింగం అర్జునుడు హత్యకు గురయ్యాడు. స్నేహితులతో కలిసి వెళ్లిన అర్జునుడికి అక్కడే ఉన్న బచ్చల మారుతి పవన్ కల్యాణ్ అనే వ్యక్తితో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో అతడు కత్తితో దాడి చేయగా అర్జునుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక ఆయన మృతి చెందాడు.

ఈ రెండు ఘటనలను అత్యంత తీవ్రంగా పరిగణించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కాకినాడ జిల్లా పోలీసు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. రెండు కేసుల్లోనూ వాస్తవాలను వెలికితీసేలా సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, నిందితులెవరైనా చట్టం ముందు తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేందుకు పోలీసు వ్యవస్థ మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

సమాజంలో పెరుగుతున్న హింసాత్మక ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మద్యం మత్తులో లేదా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను శాశ్వత విషాదంలోకి నెట్టడమే కాకుండా యువత భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నాయని అన్నారు. యువత సంయమనం పాటించాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలు, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.