ట్రంప్ శవపేటిక చిత్రం కలకలం.
• టెహ్రాన్ హోర్డింగ్‌పై హెచ్చరికలు.. అంతర్జాతీయంగా చర్చనీయాంశం.
ఢిల్లీ, మహా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ట్రంప్ శవపేటికలో ఉన్నట్టుగా రూపొందించిన చిత్రంతో పాటు ఆయనను అంతం చేస్తామంటూ ఇంగ్లిష్, పర్షియన్ భాషల్లో రాసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్–అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ హోర్డింగ్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
టెహ్రాన్‌లోని ప్రముఖ ఎంఘిలాబ్ స్క్వేర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్‌పై మినాబ్ ప్రాంతానికి చెందిన చిన్నారుల స్మృత్యర్థమని కూడా పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిగిన తొలి దాడిలో మినాబ్ నగరంలోని ఒక పాఠశాలపై దాడి జరిగి పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రస్తావిస్తూ ఈ నిరసన సందేశాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఆ ఘటనలో మరణించిన చిన్నారులకు నివాళిగా, అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి సంబంధించిన కుట్రలు జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ కొద్ది రోజుల క్రితమే అమెరికా అధికారులను అప్రమత్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థల నుంచి అందిన సమాచారాన్ని అమెరికా భద్రతా సంస్థలు కూడా అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ట్రంప్ భద్రతకు ముప్పు ఉండవచ్చనే అంశంపై అమెరికా నిఘా సంస్థలు అప్రమత్తంగా ఉన్నట్లు కూడా కథనాలు వెలువడ్డాయి.
ఈ పరిణామాల అనంతరం డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. తనపై ఎలాంటి దాడికి ప్రయత్నించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ వైపు భారీ స్థాయిలో క్షిపణులను సిద్ధంగా ఉంచామని, అమెరికా ప్రయోజనాలు లేదా తన భద్రతకు ముప్పు కలిగించే ఏ చర్యనైనా కఠినంగా తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన నేపథ్యంలో ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలపై అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మధ్యప్రాచ్యంలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య టెహ్రాన్‌లో ప్రదర్శించిన ఈ హోర్డింగ్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న రాజకీయ, భద్రతా పరిణామాలు అంతర్జాతీయ శాంతి, స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.







