Mahaa Daily Exclusive

  వికసిత భారత్ లక్ష్యంగా పార్లమెంట్ సమావేశాలు….

Share

వికసిత భారత్ లక్ష్యంగా పార్లమెంట్ సమావేశాలు.
• చర్చలకు ప్రభుత్వం సిద్ధం.. సభను అడ్డుకోవద్దన్న డాక్టర్ లక్ష్మణ్.
ఢిల్లీ, మహా.
వికసిత భారత్–2047 లక్ష్య సాధనే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగనున్నాయని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, సమగ్ర సంస్కరణలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంట్‌లో విస్తృత చర్చ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన చట్టాలు, విధానాలపై అన్ని రాజకీయ పార్టీలు నిర్మాణాత్మకంగా చర్చల్లో పాల్గొని దేశాభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడిన డాక్టర్ లక్ష్మణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అందించిన సేవలను ప్రస్తావించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ప్రజా సేవా ప్రస్థానం నుంచి ప్రధానమంత్రి పదవి వరకు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ పథకాల అమలు వంటి అనేక చారిత్రక నిర్ణయాలతో భారతదేశం ప్రపంచ వేదికపై మరింత బలంగా నిలిచిందని పేర్కొన్నారు.

మహిళా సాధికారతకు మహిళా రిజర్వేషన్ బిల్లు కీలక మైలురాయిగా నిలుస్తుందని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. అయితే ఈ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రతిపక్షాలు రాజకీయ కారణాలతో అడ్డుకుంటున్నాయని విమర్శించారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని, ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ స్థానాలు తగ్గకుండా అవసరమైతే 50 శాతం వరకు పెంచే అంశంపై భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.

అవినీతి నిరోధక చట్టాలకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. పార్లమెంట్‌లో అనవసర అంతరాయాలు సృష్టించడం కంటే ప్రజలకు ఉపయోగపడే చర్చల్లో పాల్గొనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణమని అన్నారు. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ నివేదిక అనంతరం పలు కీలక బిల్లుల ఆమోద ప్రక్రియ వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం విస్తృతంగా చర్చించేందుకు సిద్ధంగా ఉందని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి అవసరాలను కూడా పార్లమెంట్‌లో బలంగా ప్రస్తావిస్తామని చెప్పారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ స్థాయిలో నిధులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మంజూరు చేసిందని ఆయన వివరించారు.

రానున్న వర్షాకాల సమావేశాలు దేశ భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే కీలక సమావేశాలుగా నిలుస్తాయని డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. సభను అడ్డుకోవడం కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలపై సార్థక చర్చల్లో పాల్గొని దేశ ప్రయోజనాలను అత్యున్నత ప్రాధాన్యంగా పరిగణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.