Mahaa Daily Exclusive

  తెలంగాణ రేషన్ బియ్యం స్మగ్లింగ్ గుట్టురట్టు….

Share

తెలంగాణ రేషన్ బియ్యం స్మగ్లింగ్ గుట్టురట్టు.
* 220 టన్నుల బియ్యం స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో పేదల ఆహార భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న భారీ స్మగ్లింగ్ ముఠాను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. గచ్చిబౌలి పోలీసులు, పౌరసరఫరాల విజిలెన్స్ అధికారుల సంయుక్త చర్యలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం కేటాయించిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి లాభాలు ఆర్జిస్తున్న వ్యవస్థీకృత ముఠాపై అధికారులు ఉక్కుపాదం మోపడంతో అక్రమ రవాణా ముఠాలపై మరిన్ని చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి ప్రాంతం నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు, పౌరసరఫరాల విజిలెన్స్ అధికారులతో కలిసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వాహనాల కదలికలను నిశితంగా గమనించిన అధికారులు దాడులు నిర్వహించి భారీ పరిమాణంలో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

దాడుల్లో సుమారు 220 టన్నుల రేషన్ బియ్యంతో పాటు 40 బస్తాల గోధుమలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి రవాణాకు వినియోగిస్తున్న నాలుగు లారీలు, నాలుగు టాటా ఏస్ వాహనాలను కూడా సీజ్ చేశారు. ప్రభుత్వ పంపిణీ కోసం ఉద్దేశించిన ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తూ నల్లబజారులో విక్రయించేందుకు కుట్ర పన్నినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ వ్యవహారంపై నిందితులపై కంట్రోల్ యాక్ట్–2016 కింద కేసు నమోదు చేశారు. పట్టుబడిన నిందితులను లోతుగా విచారిస్తున్నామని, ఈ స్మగ్లింగ్ వెనుక మరింత పెద్ద నెట్‌వర్క్ ఉన్న అవకాశాన్ని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. రేషన్ బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు, ఇందులో మరెవరి ప్రమేయం ఉంది, గతంలో కూడా ఇదే తరహా అక్రమ రవాణా జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

పేదలకు చేరాల్సిన ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా మళ్లించి ఇతర రాష్ట్రాలకు తరలించడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్రవ్యాప్తంగా నిఘాను మరింత బలోపేతం చేసి, ఇలాంటి ముఠాలను పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.