Mahaa Daily Exclusive

  పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తాం…

Share

పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తాం.
• డీలిమిటేషన్ బిల్లుతో పాటు పలు ప్రతిపాదిత చట్టాలను వ్యతిరేకిస్తాం.
• కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
ఢిల్లీ, మహా.
రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయంగా నిలదీసే వేదికగా వినియోగించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అయోధ్య రామమందిర విరాళాల వినియోగంపై వచ్చిన ఆరోపణలు, పేపర్ లీక్‌లు, విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలు, ధరల పెరుగుదల, విదేశాంగ విధానం, అవినీతి ఆరోపణలు, సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలతో పాటు పలు ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. అలాగే డీలిమిటేషన్‌కు సంబంధించిన ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకురావచ్చని భావిస్తున్న కొన్ని కీలక బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని పార్టీ స్పష్టం చేసింది.

దిల్లీలోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, పి. చిదంబరం, శశి థరూర్ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్న బిల్లులు, ప్రతిపక్షాల సమన్వయంపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, దేశ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పేపర్ లీక్‌లు, ధరల పెరుగుదల, విదేశాంగ విధానం, అట్టడుగు వర్గాల హక్కులు, పర్యావరణ పరిరక్షణ, ఇథనాల్ మిశ్రమ విధానం వంటి అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. అయోధ్య రామమందిర విరాళాల నిర్వహణపై వచ్చిన ఆరోపణల విషయంలో కూడా కేంద్రాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు.

డీలిమిటేషన్ అంశంపై కాంగ్రెస్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. బిల్లును అధ్యయనం చేసేందుకు తగిన సమయం కల్పించాలని కూడా కోరారు. గతంలో ఇదే అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖలు రాసినప్పటికీ స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ, డీలిమిటేషన్ బిల్లును మళ్లీ ప్రవేశపెడితే తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఒకే దేశం–ఒకే ఎన్నిక అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక, వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు–2025, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లు, జాతీయ ఆహార భద్రతా చట్టం సవరణ బిల్లుతో పాటు కేంద్రం తీసుకురావచ్చని భావిస్తున్న ఇతర ప్రతిపాదనలపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఈ అంశాల్లో ప్రతిపక్ష పార్టీలతో సమన్వయం కొనసాగిస్తామని చెప్పారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు కొనసాగుతుందని, అయితే దానిని డీలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానించడాన్ని వ్యతిరేకిస్తామని జైరాం రమేశ్ వెల్లడించారు. ప్రస్తుత లోక్‌సభ స్థానాల ఆధారంగానే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని తమ పార్టీ చాలాకాలంగా డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వస్తే బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. డీలిమిటేషన్ అంశంపై ఇతర ప్రతిపక్ష పార్టీలతో చర్చలు కొనసాగిస్తున్నామని, పార్లమెంట్ సమావేశాల్లో ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.