పేదల సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వం.
* భట్టి విక్రమార్కకు లబ్ధిదారుల కృతజ్ఞతలు
మధిర, మహా.
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందపురం గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన నూతన గృహంలో ఆదూరి మనోజ్ కుమార్–దీప్తి దంపతుల గృహప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉమ్మినేని బాబు హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి శాశ్వత నివాసం కల్పించిన ఈ పథకం జీవితంలో మరపురాని ఘట్టమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కళ్యాణపు నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. కొత్త ఇంటిలో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు ఉమ్మినేని రమేష్, జట్టం పుల్లయ్య, ఇరుగు లెనిన్, మంద తిరుమలరావు, సత్య, తమ్మరపు బ్రహ్మం, ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్వరూప్, సాధం కొండలరావు, రాజమణి తదితరులు పాల్గొన్నారు.








