- తక్షణమే పదవికి రాజీనామా చేయాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.12 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలి.
- యువతపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని
- రాష్ట్ర విద్యాశాఖను యువకులకు అప్పగించాలి.
- మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
హైదరాబాద్, మహా : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుండి 21 ఏళ్లకు తగ్గించాలనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ శాసనసభ్యుడికి అనుభవం అవసరమనే దూరదృష్టితోనే 25 ఏళ్ల వయస్సును నిర్ణయించారని, ఇప్పుడు సీఎం చేస్తున్నది కేవలం మభ్యపెట్టే రాజకీయం మాత్రమేనని స్పష్టం చేశారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి నిజంగా యువతకు అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే, ముందుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి నుండి మల్లికార్జున్ ఖర్గేని తప్పించి యువ నాయకుడికి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఇప్పటికే నితిన్ నబిన్ ను జాతీయ అధ్యక్షుడిగా నియమించి యువతకు తగిన ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా విద్యార్థులు, యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు కళాశాలల్లోనే నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలోని 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిధుల కొరత, అధ్యాపకుల కొరతతో తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలకు వెయ్యు కోట్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ఉపాధ్యాయులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక విద్యా వ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డులు, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, ప్రైవేట్ ఉద్యోగాల్లో 75% స్థానికులకు రిజర్వేషన్లు, యూత్ కమిషన్, ఎంప్లాయిమెంట్ సపోర్ట్ సిస్టమ్ వంటి ప్రతి హామీ గాలిలో కలిసిపోయిందని విమర్శించారు. విద్యాశాఖను యువ నాయకుడికి అప్పగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ మాటను కూడా నిలబెట్టుకోలేదని, విద్యాశాఖలో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ బాధ్యతలను కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డికి అప్పగించాలన్నారు. దేశవ్యాప్తంగా యువత ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీపైనే విశ్వాసం ఉంచారని, అందుకే బీజేపీ అతిపెద్ద రాజకీయ శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు.
కలాంకు నివాళి
మాజీ రాష్ట్రపతి, ‘మిస్సైల్ మ్యాన్’ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ తరఫున ఎన్. రాంచందర్ రావు గారు ఘనంగా నివాళులర్పించారు. యువత, విద్యార్థుల అభ్యున్నతే కలాం జీవిత లక్ష్యమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం విద్యా వ్యవస్థపై దృష్టి సారించి విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. .
శ్రీమన్ భగవద్గీత పుస్తకావిష్కరణ:
మీడియా సమావేశంలో జేఎన్టీయూలో జరిగిన పరిశోధన ఆధారంగా, ప్రొఫెసర్ మల్లికార్జున్, సుజాత సంయుక్తంగా రచించిన ‘శ్రీమన్ భగవద్గీత’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం కార్పొరేట్ రంగంలోని ఉద్యోగులు, యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆత్మశాంతి, స్థితప్రజ్ఞత, ఏకాగ్రత, సత్వగుణం, శరణాగతి వంటి అంశాలను భగవద్గీత దృక్పథంలో సమగ్రంగా వివరించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి అందులోని మానవీయ విలువలను ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగ్మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.








