29.07.2026
HYDERABAD
OFFICE OF THE MINISTER FOR FOREST, ENVIRONMENT AND ENDOWMENTS, TELANGANA GOVERNMENT
- దేవాదాయ శాఖలో మరోసారి పదోన్నతుల పండుగ
- బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియం (దేవులపల్లి రామానుజరావు కళామందిరం) వేదికగా భావోద్వేగభరితంగా సాగిన కార్యక్రమం
- 48 మంది ఉద్యోగులకు గ్రేడ్ 3 ఈవోలుగా, ఇద్దరికి గ్రేడ్ 2, ఒకరికి గ్రేడ్ 1 ఈవోలుగా పదోన్నతి
- 15 మంది అర్హులైన అర్చకులకు /వారి కుటుంబ సభ్యులకు పదవీ విరమణ, డెత్ గ్రాట్యుటీ, వివాహ రుణం మంజూరు చేస్తూ ఉత్తర్వుల అందజేత
- మంత్రి కొండా సురేఖ గారి సారథ్యంలో ఇప్పటికే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈవోలుగా 168 మందికి ఉత్తర్వులు అందజేసిన దేవాదాయశాఖ
- కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పనితీరుకు దేవాదాయ శాఖ పనితీరే నిదర్శనమన్న మంత్రి సురేఖ
- ఉద్యోగుల హక్కులను కాపాడటంలో, వారికి దక్కాల్సిన ప్రయోజనాలను అందించడంలో ఎప్పుడూ ముందుంటామన్న మంత్రి సురేఖ
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో దేవాదాయశాఖ ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా కార్యాచరణను అమలుచేస్తున్నామని స్పష్టీకరణ
- దేవాదాయశాఖలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఇక నుంచి స్వాతంత్ర్యదినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవాల సందర్భంగా అవార్డులు, రివార్డులు అందించేలా కార్యాచరణను రూపొందించాలని దేవాదాయశాఖ డైరక్టర్ హనుమంతరావును ఆదేశించిన మంత్రి
- మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరక్టర్ హనుమంతరావు లపై ఉద్యోగుల ప్రశంసల జల్లు
దేవాదాయశాఖ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం, దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణను అమలుచేస్తున్నామని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు తెలిపారు. ఈ రోజు బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్(ఆడిటోరియం (దేవులపల్లి రామానుజరావు కళామందిరం) వేదికగా జరిగిన ఉద్యోగుల పదోన్నతుల కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరిలో 48 మంది ఉద్యోగులు గ్రేడ్ 3 ఈవోలుగా, ఇద్దరు గ్రేడ్ 2 ఈవోలుగా, ఒకరు గ్రేడ్ 1 ఈవోలుగా మంత్రి సురేఖ గారి చేతులు మీదుగా పదోన్నతుల ఉత్తర్వులను అందుకున్నారు. వీరితో పాటు అర్చక సంక్షేమ నిధి ద్వారా అర్హులైన 15 మంది అర్చకులకు (వారి కటుంబ సభ్యులు) పదవీ విరమణ, మరణ గ్రాట్యుటీ, వివాహ రుణం మంజూరు ఉత్వర్వులను మంత్రి సురేఖ గారు అందించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ డైరక్టర్ హనుమంతరావు, రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (SITA) డైరక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు, ఆర్జెసి రామకృష్ణారావు, డిప్యూటి కమిషనర్ వినోద్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు జ్యోతి, శ్రీనివాస్, ఈవోల సంఘం అధ్యక్షుడు నరేందర్, టెంపుల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగారెడ్డి, తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగ జాక్ కన్వీనర్ డి.వి.ఆర్.శర్మ, పలువురు దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతులు అందుకున్నవారితో కలిపి, గతంలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 కేటగిరీల్లోనూ పదోన్నతులు ఇవ్వడం ద్వారా మొత్తం 168 మంది ఉద్యోగులకు కార్యనిర్వహణాధికారులుగా పదోన్నతి కల్పించి, ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. సరిగ్గా పది రోజుల క్రితం రవీంద్రభారతి వేదికగా వేదపండితులు, అర్చకులు, పరిచారకులు, డోలు, సన్నాయి కళాకారులు తదితర 191 ధార్మిక నియామక ఉత్తర్వులు అందజేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
అర్చక సంక్షేమ నిధి కింద పదవీ విరమణ, మరణ గ్రాట్యుటీని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడంతో పాటు అంత్యక్రియల సహాయాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచి అర్చక కుటుంబాలకు మరింత భరోసా కల్పించామని మంత్రి తెలిపారు. సరస్వతి నది ఆది, అంత్య పుష్కరాలను విజయవంతంగా నిర్వహించామని, గోదావరి పుష్కరాలు (2027), కృష్ణ పుష్కరాలు (2028) కోసం ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పుష్కరాలు అంటే తెలంగాణ అనే స్థాయిలో రానున్న పుష్కరాలు చేపడతామని మంత్రి సురేఖ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖలో సంస్కరణల యుగానికి శ్రీకారం చుట్టామని, నియామకాలు, పదోన్నతులు, ఉద్యోగుల సంక్షేమం, భక్తులకు మెరుగైన సేవలు, ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో దేవాదాయశాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేస్తూ, దేవాదాయశాఖను మరో స్థాయిలో నిలబెట్టేలా కార్యక్రమాలు చేపడతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
దశాబ్దాల నిరీక్షణకు తెరపడడంతో ఈవోలుగా పదోన్నతులు అందుకున్న ఉద్యోగులు భావోద్వేగానికి లోనయ్యారు. తమ ఉద్యోగ జీవితంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన గుర్తింపు లభించడంతో వారంతా మంత్రి కొండా సురేఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.







