విద్యార్థులపై దాడికి అమిత్ షాదే బాధ్యత.
* లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.
* క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు.. లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న కాంగ్రెస్.
ఢిల్లీ, మహా.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడి ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే బాధ్యత వహించాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఘటనపై అమిత్ షా దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ, లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడటం తన హక్కు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే లోక్‌సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పూ లేదని, అందువల్ల క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విద్యార్థులపై మేకులు ఉన్న లాఠీలతో దాడి చేశారని, పెల్లెట్ గన్ తగిలి ఓ యువకుడు ఒక కన్ను కోల్పోయాడని ఆరోపించారు. ఢిల్లీ వీధుల్లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను అత్యంత దారుణంగా కొట్టారని విమర్శించారు.
పార్లమెంట్లో జరిగిన చర్చను ప్రస్తావిస్తూ, ఢిల్లీ పోలీసు వ్యవస్థ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్నందున విద్యార్థులపై జరిగిన దాడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా బాధ్యత వహించాలని లోక్‌సభలో తాను పేర్కొన్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఈ ఘటనలో కాల్పులకు ఆదేశాలు కూడా అమిత్ షానే ఇచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ, అందుకే ఆయన సభకు హాజరు కాలేదని ఆరోపించారు.
రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర హోంమంత్రిపై ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలోనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ అంశం పార్లమెంట్లో రాజకీయ దుమారం రేపింది.






