Mahaa Daily Exclusive

  కొన్నిసార్లు మనుసును చంపుకొని పని చేయాల్సి వస్తోంది..

Share

  • మానవత్వంతో ఆలోచిస్తే సమాజమంతా బాధపడాల్సి వస్తుంది
  • హైడ్రా చీఫ్ రంగనాథ్

 

హైదరాబాద్, మహా:

నిర్మాణాలు కూల్చి చెరువులు కాపాడటం హైడ్రా ఉద్దేశం కాదని, చెరువుల పరిధిలో కొత్త నిర్మాణాలను అడ్డుకోవడం తమ లక్ష్యమని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ అన్నారు. చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన పని లేదని అన్నారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాప్‌లు, విలేజ్ మ్యాప్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. ఇవాళ హైడ్రా కార్యాలయంలోని విశ్రాంత ఇంజినీర్లు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో రంగనాథ్ సమావేశమై హైడ్రాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజమంతా బాధపడాల్సి వస్తుందని రంగనాథ్ పేర్కొన్నారు. కొన్నిసార్లు మనుసును చంపుకొని పని చేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అమీన్‌పూర్ తూములు మూయడంతోనే లేఔట్లు మునిగాయని తెలిపారు. తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే కూల్చివేశామని వెల్లడించారు. కొంతమందిపై చర్యలతో హైడ్రా పని అందరికీ తెలిసిందని అన్నారు. ప్రజల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన వస్తోందని, ఆక్రమణల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వాడుతున్నామని వివరించారు. నిపుణులు ఇచ్చిన సూచనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ప్రతి చెరువు పునరుద్ధరణకు ప్రజలను భాగస్వామ్యం చేస్తామని పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు.

 

వాతావరణ శాఖతో కలిసి పని చేస్తాం

మరోవైపు ప్రకృతి విపత్తుల నుంచి హైదరాబాద్‌ ప్రజలను అప్రమత్తం చేసేందుకు వాతావరణశాఖతో కలిసి పని చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల వాతావరణశాఖ నుంచి వచ్చే అప్రమత్త సందేశాలు కచ్చితత్వంతో ఉండేలా చూసుకోవాలని సూచించారు. భారత వాతావరణ శాఖ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ అమీర్పేట్‌లోని సెస్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎండీ అలర్ట్ సందేశాన్ని ఆయన ఆవిష్కరించారు. వాతావరణ మార్పులను అంచనా వేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహోపాత్ర తెలిపారు. బెంగళూరు తరహాలో ప్రతి 15 నిమిషాలకు డేటా సేకరించి విశ్లేషించాలని రంగనాథ్‌ అభిప్రాయపడ్డారు.