Mahaa Daily Exclusive

  అసంతృప్తులకు సీఎం హితవు….

Share

అసంతృప్తులకు సీఎం హితవు.
• ‘రాజీనామా చేస్తే వెంటనే ఆమోదం’
• ముఖ్యమంత్రి డీకే శివకుమార్ .

బెంగళూరు, మహా.
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ తర్వాత మంత్రి పదవులు దక్కక అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గట్టి సందేశం ఇచ్చారు. అవకాశాలు అందరికీ ఒకేసారి రావని, సహనం పాటిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని సూచించారు. ఎవరైనా రాజీనామా చేస్తానంటే అడ్డుకోబోమని, అలాంటి నిర్ణయాన్ని నిమిషాల్లోనే ఆమోదిస్తామని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో 20 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కగా, అవకాశం రాని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన డీకే శివకుమార్, రాజీనామా చేస్తానని చెప్పేవారు రాజకీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే పార్టీని విడిచి వెళ్లే ముందు భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచించారు. రాజకీయ భవిష్యత్తును కల్పించే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని పేర్కొన్నారు.

తన రాజకీయ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులను ఎన్నోసార్లు ఎదుర్కొన్నానని సీఎం గుర్తుచేశారు. ధరమ్ సింగ్, సిద్ధరామయ్య హయాంలో తనకు మంత్రి పదవి రాని సందర్భాలు ఉన్నప్పటికీ సహనంతో వేచి చూశానని చెప్పారు. అలాగే వీరేంద్ర పాటిల్ కాలంలో బంగారప్పకు, ఖర్గేకు, ధరమ్ సింగ్‌కు కూడా ఒక దశలో అవకాశం రాలేదని, కానీ తర్వాత వారు కీలక పదవులు చేపట్టి ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారని ఉదాహరణగా వివరించారు. రాజకీయాల్లో ఓర్పు అత్యంత అవసరమని, పార్టీ ప్రయోజనాలే వ్యక్తిగత ఆశయాల కంటే ముఖ్యమని ఎమ్మెల్యేలకు సూచించారు.

మరోవైపు, మంత్రి పదవులు రాక అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నాయకులకు డీకే శివకుమార్ అప్పగించారు. అసంతృప్తి మరింత పెరగకుండా పార్టీ ఐక్యతను కాపాడే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.