Mahaa Daily Exclusive

  జల్ జీవన్ పనులకు వేగం….

Share

జల్ జీవన్ పనులకు వేగం.
• నీటి ఎద్దడిపై పవన్ ఫోకస్.
• ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.

అమరావతి, మహా.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన ఆయన, తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

తీరప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడంలో జల్ జీవన్ మిషన్ కీలక పాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు లక్ష్యాల సాధన దిశగా పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల కింద సుమారు రూ.270 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 400 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు అధికారులు వివరించగా, మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

ప్రాజెక్టు అమలులో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్, నిర్మాణ పనుల నాణ్యతను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన తాగునీటి సౌకర్యం అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.