- కలెక్టర్ హత్యకు బిఆర్ఎస్ ప్లాన్
- కాంగ్రెస్ నిజనిర్ధారణ బృందం ఆరోపణ
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను హత్య చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేసిందని నిజనిర్ధారణ బృందం ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మాజీ సీఎం కేసీఆర్ కుట్రలు పన్నారని బృందం సభ్యులు ఆరోపించారు. లగచర్ల దాడి ఘటనలో నిజానిజాలు తేల్చేందుకు ఎంపీ మల్లు రవి, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కలిసి శుక్రవారం లగచర్లలో పర్యటించారు. ఆ రోజు జరిగిన దాడి, ఘర్షణ వాతావరణంపై గ్రామస్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దాడిలో ఎవరెవరు పాల్గొన్నారనే అంశాలపైనా ఆరా తీశారు. బీఆర్ఎస్ నాయకులే ప్రకా పథకం ప్రకారం దాడి చేశారని నిర్ధారణకు వచ్చారు. అనంతరం హైదరాబాద్‌లోని సచివాలయానికి చేరుకుని మీడియా సమావేశం నిర్వహించారు.
భూమి లేని వారు దాడి
ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. “మా ప్రతినిధుల బృందం లగచర్ల గ్రామానికి వెళ్లింది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, స్థానిక రైతులతో మాట్లాడాం. దాడి జరిగిన రోజు కలెక్టర్ రాగానే కొందరు తాగి వచ్చి కర్రలు, రాళ్లతో కలెక్టర్, అధికారులపై దాడికి పాల్పడ్డారు. గతంలో ఇలాంటి దాడులు ఎప్పుడూ చూడలేదు. ఈ దాడి వెనక బీఆర్ఎస్ హస్తం ఉంది. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత సురేశ్ సహా మరికొంతమంది నాయకులు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారు. 17 మంది భూమిలేని వారు దాడి చేయడానికి అక్కడికి వచ్చారు. త్వరలోనే అక్కడి మాజీ సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తామని చెప్పారు. ఘటనపై నిజనిర్ధారణ రిపోర్టును సీఎం, ప్రతిపక్ష నాయకులకు ఇస్తాం. రేవంత్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం కాదు. బలవంతంగా వారి భూములు తీసుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ” అని చెప్పారు.
ఎవ్వరినీ మాట్లాడనీయలేదు..
లగచర్లలో రైతుల స్వేచ్ఛకు భంగం కలిగిందని రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లే దాడి జరిగిందని ఆయన చెప్పారు. రైతులకు ఇష్టం లేని పని తానేప్పుడూ చేయనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన తెలిపారు. పరిశ్రమలు రావడం వల్ల యువతకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారని కోదండ రెడ్డి చెప్పారు. పబ్లిక్ హియరింగ్‌లో రైతులు, స్థానికులను బీఆర్ఎస్ నాయకులు మాట్లాడనీయలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయం రెండూ అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్షించారని కోదండ రెడ్డి చెప్పుకొచ్చారు.
కేసీఆర్ కుట్ర..
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు చేశారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌ని చంపించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలని కుట్రలు పన్నారని మండిపడ్డారు. జిల్లాలో రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశారని, ఇప్పుడు రూ.15 వేల కోట్లతో ఇండస్ట్రీ బెల్ట్ తీసుకురావాలని సీఎం రేవంత్ భావిస్తున్నారని రామ్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ దురాగతాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. పరిశ్రమలు పెట్టడానికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు.