Mahaa Daily Exclusive

  మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం….ఆగస్టు 28 నుంచి టోర్నీ?

Share

ఢిల్లీ, మహా.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. మహిళల టీ20 ఆసియా కప్-2026 టోర్నీని ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రణాళికలు సిద్ధం చేసినట్లు క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టోర్నీ తేదీలను సభ్య దేశాలకు అంతర్గతంగా తెలియజేసినట్లు సమాచారం.

ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే మ్యాచ్‌ల షెడ్యూల్, వేదికలు, గ్రూపుల వివరాలను ఏసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పరిపాలనా అనుమతులు, వేదికల ఖరారులో జాప్యం కారణంగానే పూర్తి షెడ్యూల్ విడుదల ఆలస్యమవుతున్నట్లు సమాచారం.

ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈ జట్లు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్–పాకిస్థాన్ మహిళల మ్యాచ్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడతాయనే విషయంపై ఏసీసీ అధికారిక షెడ్యూల్ విడుదలైన తర్వాతే స్పష్టత రానుంది.

సభ్య దేశాలకు పంపిన సమాచారంలో అన్ని జట్లు ఆగస్టు 27 నాటికి యూఏఈ చేరుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 13న ఫైనల్ మ్యాచ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆసియా కప్ చరిత్రలో భారత మహిళల జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఏడు టైటిళ్లను కైవసం చేసుకున్న టీమిండియా, 2024 ఫైనల్లో మాత్రం శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. ఈసారి మరోసారి టైటిల్‌ను తిరిగి సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.