Mahaa Daily Exclusive

  ఏపీలో డెయిరీ రంగం కుదేలు….పార్లమెంట్‌లో కేంద్రం గణాంకాలు…

Share

ఢిల్లీ, మహా.
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాడిపరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో పాల ఉత్పత్తి తగ్గడంతో పాటు తలసరి పాల లభ్యత కూడా గణనీయంగా క్షీణించినట్లు పేర్కొంది. ఈ గణాంకాలు గత ప్రభుత్వ హయాంలో డెయిరీ రంగం ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రతిబింబిస్తున్నాయని వివరించింది.

కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో పాల ఉత్పత్తి 15.45 మిలియన్ టన్నుల నుంచి 13.95 మిలియన్ టన్నులకు తగ్గింది. ఒకే ఏడాదిలో దాదాపు 10 శాతం మేర పాల ఉత్పత్తి పడిపోయినట్లు తెలిపింది. అలాగే రోజువారీ తలసరి పాల లభ్యత 799 గ్రాముల నుంచి 716 గ్రాములకు తగ్గినట్లు వెల్లడించింది. ఈ పరిస్థితి పాడి రైతుల ఆదాయంపై కూడా ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది.

అయితే రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెయిరీ రంగానికి కేంద్రం భారీగా ప్రోత్సాహం అందిస్తున్నట్లు వెల్లడించింది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెయిరీ డెవలప్‌మెంట్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.115.65 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపింది. గతంలో ఇదే పథకం కింద కేవలం రూ.6 కోట్లే కేటాయించగా, ప్రస్తుతం ఆ మొత్తాన్ని దాదాపు 19 రెట్లు పెంచినట్లు వివరించింది.

పశుసంవర్ధక మౌలిక వసతుల అభివృద్ధి నిధి కింద కూడా రాష్ట్రానికి రూ.6.57 కోట్లను మంజూరు చేసినట్లు కేంద్రం పేర్కొంది. అదనంగా పశువుల్లో వ్యాధుల నివారణ, ఉచిత టీకా కార్యక్రమాల అమలు కోసం రూ.75.96 కోట్ల నిధులను విడుదల చేసినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో పాడిపరిశ్రమను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నాయని, పాల ఉత్పత్తి పెంపుతో పాటు పాడి రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టం చేసింది.