అమరావతి, మహా .
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు సదరం సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వేదిక ద్వారా సదరం సేవలను అందుబాటులోకి తీసుకువస్తూ కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఈ మేరకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) మంగళవారం కీలక వివరాలను వెల్లడించింది.
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దివ్యాంగులు ఇకపై సదరం సేవలను ఇంటి నుంచే పొందే అవకాశం కల్పించినట్లు ఆర్టీజీఎస్ తెలిపింది. ఇందుకోసం మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు ‘హాయ్’ అని సందేశం పంపి, అనంతరం సదరం సేవల ఎంపిక ద్వారా అవసరమైన సేవలను పొందవచ్చని వివరించింది.
ఈ సేవల ద్వారా సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవడం, అందుబాటులో ఉన్న స్లాట్ల వివరాలను తెలుసుకోవడం, ఇప్పటికే జారీ చేసిన సదరం సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకోవడం వంటి సౌకర్యాలు ఒకే వేదికపై లభిస్తాయని పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలకు పలుమార్లు వెళ్లాల్సిన అవసరం లేకుండా దివ్యాంగులకు సేవలను వేగంగా, పారదర్శకంగా అందించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని వివరించింది.
దివ్యాంగులు ఈ డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ సేవలను మరింత సులభంగా పొందాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ విజ్ఞప్తి చేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌ను విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.







